Andhra Pradesh Polling Percentage: పెరిగిన పోలింగ్ శాతం ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతోంది. తమదే విజయం అంటూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఈవీఎంలలో నిక్షిప్తమైన రహస్యాన్ని ఛేదించే పనిలో ఉన్నారు. నియోజకవర్గాలు, మండలాలు, పంచాయతీలు వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఇంకా ఫైనల్ పోలింగ్ శాతాలు తేలకపోవడం కూడా నేతలను కంగారు పెట్టిస్తోంది. 

పోలింగ్ రోజు మార్నింగ్‌ ఓటరు ఉత్సాహం చూసిన వారంతా ఎవరికి నచ్చినట్టు వాళ్లు లెక్కలు వేసుకున్నారు. తమకే అనుకూలంగా ఉందంటూ ప్రచారం చేసుకున్నారు. ఇంతలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలు కూడా గెలుపు అంచనాలను పూర్తి మార్చేసిందనే విశ్లేషణలు లేకపోలేదు. నాలుగు గంటల వరకు ఓ రకమైన పోలింగ్ నమోదు కాగా... ఆఖరి రెండు గంటల్లో నమోదైన పోలింగ్ అన్ని పార్టీల అభ్యర్థులకు టెన్షన్ పెట్టిస్తోంది. 

మహిళలు, వృద్ధులు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ హక్కును వినియోగించుకున్నారు. ఇది అభ్యర్థులను ఏ తీరానికి చేరుస్తుందో అన్న టెన్,న్ పార్టీల్లో ఉంది. ఉదయం ఆరు గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు పెద్ద ఎత్తున గుమ్మిగూడారు. ఎండ ప్రభావం తీవ్రంగా లేకపోవడంతో వృద్ధులు కూడా భారీగా ఓటింగ్‌కు తరలి వచ్చారు.  

రాష్ట్రంలో 4, 14,01,887 మంది ఓటర్లలో రెండు కోట్ల పది లక్ష 58 వేల 615మంది మహిళలు ఉన్నారు. ఈ లెక్కన అభ్యర్థుల భవిష్యత్‌ను నిర్ణయించేది వీళ్లే అందుకే వీరి ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి తలరాత మారుతోందో అన్న డిస్కషన్ పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా సాగుతోంది. సోమవారం సాయంత్రానికి అందిన వివరాలు ప్రకారం మహిళా ఓటర్లలో 67 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా అధికారిక లెక్కలు వెల్లడైతే ఎంత మంది పెరుగుతారో అన్నది ఆసక్తిగా మారింది. 

ఇలా మహిళలు, వృద్ధుల ఓట్లు శాతం పెరగడం, పల్లెలు కదలి వచ్చి ఓట్లు వేయడం తమకే అనుకూలంగా ఉంటుందని వైసీపీ నేతలు అంచనాలు వేస్తున్నారు. కచ్చితంగా 120 సీట్ల వరకు వస్తాయని చెబుతున్నారు. పథకాలన్నీ మహిళలు సక్రమంగా అందుతున్నందున వారంతా వచ్చి ఓట్లు వేశారని భావిస్తున్నారు. 
ఎక్కువ మంది యువత పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడంతోపాటు కొత్త ఓటర్లు కూడా భారీ సంఖ్యలో రావడం వల్లే పోలింగ్ శాతం పెరిగిందని కూటమి పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. మహిళకు ప్రకటించిన పథకాలు ఆకర్షితులై తమకు ఓటు వేసేందుకే భారీ సంఖ్యలో వచ్చారని అంటున్నారు. 

ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా నియోజకవర్గాలో ఉన్న అసంతృప్తులు, ఇతర లోపాలు తమ పుట్టి ఎక్కడ ముంచుతాయో అన్న కంగారు కూడా ఉండనే ఉంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఫలితాలపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. గత పోలింగ్ శాతాలకు మించి పోలింగ్ శాతాలు నమోదు కావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. మొత్తానికి పోలింగ్ శాతాలు చూసిన చాలా మంది నేతల బీపీ మాత్రం పెరిగిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

అర్థరాత్రి వరకు వివిధ జిల్లాల్లో నమోదు అయిన పోలింగ్ పరిశీలిస్తే... 

  జిల్లా పేరు  2024(అర్థరాత్రి వరకు ) 2019 పోలింగ్ 
1 చిత్తూరు 82.65% 84.71%
2 తూర్పు గోదావరి  79.31% 81.46%
3 గుంటూరు  75.74% 79.39%
4 వైఎస్ఆర్ కడప  78.71% 79.20%
5 కృష్ణా  82.2% 84.31%
6 కర్నూలు  75.83% 75.46%
7 నెల్లూరు  78.10% 77.56%
8 ప్రకాశం  82.40% 85.78%
9 శ్రీకాకుళం  75.41% 75.30%
10 విశాఖపట్నం  65.50% 65.30%
11 విజయనగరం 79.41% 81.10%
12 పశ్చిమ గోదావరి  81.12% 80.99%
13 పార్వతిపురం మన్యం 75.24% 76.98%
14 అనకాపల్లి  81.63% 82.02%
15 అల్లూరి సీతారామరాజు  63.19% 70.20%
16 కాకినాడ  76.37% 78.99%
17 కోనసీమ 83.19% 83.93%
18 ఏలూరు  83.04% 83.36%
19 ఎన్టీఆర్  78.76% 78.00%
20 పల్నాడు  78.70% 86.69%
21 బాపట్ల  82.33% 85.67%
22 తిరుపతి  76.83% 79.16%
23 అన్నమయ్య  76.12% 76.80%
24 నంద్యాల  80.92% 81.19%
25 శ్రీ సత్యసాయి  82.77% 83.87%
26 అనంతపురం  79.25% 80.71%