ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌లో హైడ్రామా కనిపిస్తే తెలంగాణలో మాత్రం సైలెంట్‌గా ఓటింగ్‌గా ఓటింగ్ జరిగిపోయింది. కొన్నిచోట్ల బీజేపీ అభ్యర్థుల హడావుడి తప్ప అంతా ప్రశాంతంగా సాగింది. ఆరు నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలు ఈసారి ఏం వస్తాంలే అన్నట్టు కాకుండా భారీగా తరలి వచ్చి ఓట్లు వేశారు. రాత్రి 11 గంటల వరకు  అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 64.74 శాతం తెలంగాణలో పోలింగ్ నమోదు అయింది. చాలా మంది క్యూలైన్‌లో ఓట్ల కోటం రాత్రి వరకు వేచి ఉన్నారని అందుకే పూర్తి లెక్కలు మంగళవారం సాయంత్రానికి అందిస్తామంటున్నారు అధికారులు 


పెరిగిన పోలింగ్ శాతం 


తెలంగాణలో 2019 ఎన్నికలతో పోల్చుకుంటే పోలింగ్ శాతం పెరిగింది. ఆరు నెలల క్రితమే ఓటు వేసిన ప్రజలు మరింత ఉత్సాహంగా పోలింగ్ బూత్‌లకు రావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో 62.07 శాతం పోలింగ్ నమోదు అవ్వగా ఈసారి ఇప్పటికే 64 శాతం దాటేసింది పూర్తి లెక్కలు వచ్చేసరికి ఇది 70 వరకు ఉంటుందని అంటున్నారు. 



సహకరించిన వెదర్


ఓటింగ్ శాతం పెరగడానికి వాతావరణం కూడా సహకరించింది. ఎండ వేడి ఉంటుందని మార్నింగ్ సెషన్‌లో ఓటు వేసేందుకు ఓటర్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. అలా టైం గడుస్తున్న కొద్దీ పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. ఉదయం 9 గంటలకు కేవలం తొమ్మిది శాతం పోలింగ్ మాత్రమే నమోదు అయింది. వాతావరణం చల్లగా ఉండటంతో మధ్యాహ్నానానికి అంటే మూడు గంటలకు పోలింగ్ ఒక్కసారిగా 52 శాతానికి చేరుకుంది. 



నేడు పోలింగ్‌ శాతం వెల్లడి


సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటలకు పోలింగ్ ముగిసింది. ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు కారణంగా పోలింగ్ శాతం పెరిగిందన్నారు తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌. వాతావరణఁ కూడా అనుకూలించడంతో పోలింగ్ శాతం పెరిగిందని చెప్పుకొచ్చారు. ఈ మధ్యాహ్నానికి తుది పోలింగ్ శాతాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. పోలింగ్ టైంలో భారీగా ఫిర్యాదులు వచ్చాయని అందులో నలభై ఫిర్యాదులకు సంబందించి కేసులు రిజిస్టర్ చేసినట్టు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా నలభై నాలుగు స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలు భద్రపరిచామన్నారు. 


చిన్న చిన్న ఘర్షణలు


బీజేపీ అభ్యర్థులు అరవింద్, మాధవీలత ఇద్దరు పోలింగ్ కేంద్రాలను తిరుగుతూ బురఖా వేసుకున్న వారిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాళ్లు అలా వస్తే ఓటర్లను ఎలా గుర్తుపడతారంటూ అధికారులను నిలదీశారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు ఓటర్లను ఇబ్బంది పెట్టారని వారిపై కేసులు నమోదు అయ్యాయి. జనగామ జిల్లాలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల నాయకులకు గాయాలు అయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి వాతావరణాన్ని కూల్ చేశారు.




కేంద్రంలో వచ్చేది ఇండి కూటమి


దేశవ్యాప్తంగా మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు మరోసారి ఆదరిస్తారన్నారు. దీన్ని రిఫరెండంగా తీసుకుంటామని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా ఇండి కూటమి మేజార్టీ సీట్లు సాధిస్తుందని అధికారం లోకి వస్తుందని అభిప్రాయపడ్డారు.  



బీజేపీ కొత్త శక్తి


గెలుపుపై ఎవరి ధీమా వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ కొత్తశక్తిగా మారుబోతోందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా రెండు అంకెల సీట్లు సాధిస్తామన్నారు. అన్ని ప్రాంతాల్లో బీజేపీకి పాజిటివ్ ఓటు ఉందని తెలిపారు.    


 


బీఆర్‌ఎస్ మంచి ఫలితాలు


కేంద్రంలో మోదీ ప్రభుత్వంపై, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు గుణపాఠం తప్పదని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌ మంచి ఫలితాలు సాధిస్తుందని తెలిపారు.