Andhra Pradesh Polling 2024: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ అనేక నాటకీయ పరిణామాల మధ్య కొనసాగింది. పదికిపైగా జిల్లాల్లో విధ్వంసాలు జరిగాయి. ప్రత్యర్థులపై రాళ్ల వర్షం కురిసింది. రబ్బరు బులెట్లు కూడా పేలాయి. నేతల గృహనిర్బంధాలు కూడా జరిగాయి. ఇలా గతంలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్రంలో దుర్ఘటనలు జరిగాయి. ప్రత్యర్థులపై రాళ్ల దాడులు, ప్రత్యర్థులు కనిపిస్తే విరుచుకుపడ్డారు. గంటూరు, కృష్ణా, విజయనగరం, అనంతపురం, తిరుపతి, చిత్తూరు, కడప ప్రకాశం, అన్నమయ్యజిల్లాల్లో ఎక్కువ ఘటనలు జరిగాయి. 150కిపైగా ప్రాంతాల్లో కొట్లాటలు నమోదు అయ్యాయి. పోలీసులు, ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకున్నా వాటిని మాత్రం పార్టీలు పట్టించుకోలేదు. అనుకున్నట్టుగా తమకు నచ్చినట్టుగా చేసేందుకు ప్రత్యర్థలుపై తెగబడేందుకు కాలు దువ్వాయి. 



నో రీపోలింగ్


భారీగా ఘర్షణలు జరిగినా ఎక్కడా పోలింగ్‌కు ఇబ్బంది కలగలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. స్థానికంగా ఉండే వివాదాలతోనే ఇలా గొడవలు జరిగాయని దాని వల్ల ఎక్కాడ ఓటర్లు ఓటు వేసేందుకు ఇబ్బంది రాలేదని ప్రకటించింది. రీ పోలింగ్ సమస్యే ఎక్కడా రాలేదని స్పష్టం చేసింది. 



10 జిల్లాలో ఫైటింగ్ సీన్స్ 


దాదాపు పది జిల్లాల్లో టీడీపీ వైసీపీ నేతలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రత్యర్థి ఓటర్లను భయబ్రాంతులు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. పోలింగ్ సరళి పరిశీలించేందుకు వచ్చిన ప్రత్యర్థి పార్టీల వాహనాలపై రాళ్ల దాడి చేశారు. ఇలాంటి ఘటనలను అధికారులు చాలా వరకు నిలువరించగలిగారు. 



పోలింగ్ తర్వాత భయం భయం


పోలింగ్ అనంతరం కూడా చాలా ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ఆ ప్రాంతాల్లో ప్రజలు రాత్రంతా భయం గుప్పెట్లో జీవనం సాగించారు. పల్నాడు, కడప జిల్లాల్లో తమకు ఓటు వేయలేదని, తమకు వ్యతిరేకంగా పని చేశారన్న కారణంతో ప్రత్యర్థి వర్గాన్ని టార్గెట్ చేసుకున్నాయి పార్టీలు. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. పరిస్థితిని చక్కబెట్టాయి. ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నాయి. 



ఉదయాన్ని క్యూ కట్టిన ఓటర్లు


పోటాపోటీగా పార్టీలన్నీ ప్రచారం చేయడం, ప్రచార సమయంలోనే గొడవలు పడటంతో ఘర్షణలు ముందే ఊహించిన ఓటర్లు ఉదయం ఆరు గంటలకు పోలిస్ స్టేషన్ల ముందు బారులు తీరారు. త్వరగా ఓటు వేసి వెళ్లిపోవాలన్న ఆలోచన వారిలో కనిపించింది. వేసవి ప్రభావం కూడా వారిపై పడింది. ఎండ , ఉక్కపోత లేకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు వేసుకొని వెళ్లిపోవాలన్న భావనతో ఓటర్లు ఉదయాన్ని పోలింగ్ స్టేషన్లకు క్యూ కట్టారు. 



శాంతించిన సూరీడు, కరుణించిన వరుణుడు


ఏప్రిల్ మొదటి వారం నుంచి రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న ఎండలు చూసి అంతా భయపడ్డారు. ఇలాంటి రికార్డు స్థాయి ఎండల్లో ప్రజలు ఓటేసేందుకు ముందుకు వస్తారా అనే అనుమానం చాలా మందిలో కలిగింది. అయితే పోలింగ్ రోజుకు సూర్యుడు కాస్త రిలీఫ్ ఇచ్చాడు. ఉష్ణోగ్రతలు తగ్గించాడు. అటు వరుణుడు కూడా కరుణించాడు. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రానికి వర్షాలు పడ్డాయి. అప్పటికే చాలా వరకు పోలింగ్ నమోదు అయిపోయింది. ఇలాంటి చల్లటి వాతావరణంలో ఓటర్లు భారీగా వచ్చి ఓట్లు వేశారు. అందుకే పోలింగ్ శాతం పెరిగింది. 



సాయంత్రం ఆరు గంటలకు ఓటింగ్ కోసం క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు అధికారులు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సుమారు 2000 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఉదయం భారీసంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు కనిపించారు. అలా టైం గడిచే కొద్దీ ఓటర్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. చివరి రెండు గంటల్లో మాత్రం భారీగా పోలింగ్ నమోదు అయింది. పోలింగ్ రోజు వాతావరణం చూస్తే... ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో అత్యధికంగా 41 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు అయింది. మిగతా జిల్లాల్లో 40 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు అయింది.