Vijayawada Hyderabad Highway Traffic: చౌటుప్పల్: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణమయ్యారు. ఏపీలో ఓటింగ్ ముగియడంతో ఓటర్లు తమ వాహనాలలో తెలంగాణకు తిరుగు ప్రయాణం కావడంతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఓటు హక్కు వినియోగించుకుని ఏపీ నుంచి తిరిగివస్తున్న ఓటర్ల వాహనాలతో చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఏపీతోపాటు కోదాడ, ఖమ్మం నుంచి అధిక సంఖ్యలో ఓటర్లు తిరిగివస్తున్న హైదరాబాద్ బాట పట్టారు. ఆఫీసులు, పనులు, వ్యాపారాలు ఉండటంతో సొంతూళ్లకు వెళ్లిన వారు ఒకేసారి తిరుగు ప్రయాణం కావడంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా శనివారం, ఆదివారం హైదరాబాద్ నుంచి విజయవాడకు వాహనాలు క్యూ కట్టగా రహదారి కిక్కిరిసిపోయిన కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ కావడం తెలిసిందే. తాజాగా సైతం అదే పరిస్థితి కనిపిస్తోంది. దాంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.