PM Narendra Modi Nomination: వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా వారణాసి పరిసరప్రాంతాలు పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ నామినేషన్ ఘట్టానికి 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరలి రానున్నారు. వారితోపాటు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న వివిధ పార్టీల అధినేతలు తరలిరానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హజరుకానున్నారు.
గంగా సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని నామినేషన్ వేస్తున్న ప్రధానమంత్రి మోదీ నామినేషన్ వేయడానికి ముందు అస్సీ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు చేయనున్నారు. 9 గంటలకు దశాశ్వమేధ్ ఘాట్ వద్ద గంగాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ ఉన్న నమోఘాట్‌కు వెళ్తారు. అక్కడ నుంచి కాలభైరవ ఆలయానికి చేరుకుంటారు. పూజలు తర్వాత నామినేషన్ ర్యాలీ ప్రారంభమవుతుంది.
వారణాసిలోని కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు అధికారులకు సమర్పిస్తారు. అంతరం కార్యకర్తలతో సమావేశమవుతారు. నామినేషన్ కార్యక్రమానికి ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిండే, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌్, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, త్రిపుర సీఎం మాణిక్ సాహా మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు.
12 మంది సీఎంలతోపాటు కేంద్రమంత్రులు అమిత్‌షా , రాజ్‌నాథ్ సింగ్ సహా ఇతర కేంద్రమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, లోక్‌దళ్ అధినేత జయంత్ చౌదరి, ఎల్జీపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, అప్నాదళ్ చీప్ అనుప్రియ, ఎస్బీఎస్పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ కి కూడా ప్రమాణ స్వీకారంలో పాల్గొనాలని ఆహ్వానాలు అందాయి. దీంతో వీళ్లంతా కూడా వారణాసి తరలి వెళ్తున్నారు.