UGC on Ad-hoc Teachers :  యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) పరిధిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న తాత్కాలిక ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసే ఏ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం లోక్‌సభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాశ్ సర్కార్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.






రెగ్యులర్ చేసే ప్రాతిపదికన లేదు


"యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) అనుబంధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో తాత్కాలిక ఉపాధ్యాయులను శాశ్వత ఉపాధ్యాయులుగా చేర్చుకునే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు. అయితే విద్యాశాఖ, UGC ఎప్పటికప్పుడు అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయాలని సూచించాం" అని సుభాశ్ సర్కార్ చెప్పారు.  


3904 మంది తాత్కాలిక ఉపాధ్యాయులు  


సర్కార్ లోక్ సభలో ఇచ్చిన సమాధానం ప్రకారం... కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో తాత్కాలిక పోస్టులలో 3,904 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.  122 మంది అడ్ హాక్ ప్రాతిపదికన, 1,820 మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన, 1,931 మంది గెస్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU), దిల్లీ విశ్వవిద్యాలయం (DU) ఈ రెండు విశ్వవిద్యాలయాలు మాత్రమే అడ్ హాక్ ఫ్యాకల్టీలను కలిగి ఉన్నాయని సర్కార్ తెలిపారు. 


దిల్లీ విశ్వవిద్యాలయంలో అత్యధికంగా 


DUలో  248 మంది అత్యధిక గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో 150 మంది, ఇంఫాల్‌లోని మణిపూర్ విశ్వవిద్యాలయంలో 129 మంది ఉన్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన గరిష్టంగా 1,044 మంది ఉపాధ్యాయులు గల విశ్వవిద్యాలయాలలో DU అగ్రస్థానంలో ఉండగా, AMU 159 మందితో రెండో స్థానంలో, న్యూదిల్లీలోని సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం 120 మందితో మూడో స్థానంలో ఉందని మంత్రి తెలిపారు.


Also Read : NIRF Ranking 2022 List: ఉత్తమ విద్యా సంస్థల్లో ఐఐటీ మద్రాస్‌- యూనివర్సిటీల్లో బెంగళూరు టాప్


Also Read : Tips for Competitive Exams: కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి..