నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన పోర్టల్‌కు స్టూడెంట్‌ అకడమిక్‌ వెరిఫికేషన్‌ సర్వీస్‌(ఎస్‌ఏవీఎస్‌) అనే పేరును అధికారులు ఖరారుచేశారు. ఈ పోర్టల్‌ శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నది. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐటీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి ఈ పోర్టల్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు.


రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల నుంచి గత 12 సంవత్సరాల్లో సర్టిఫికెట్లు పొందిన విద్యార్థుల డేటాను ఇందులో నిక్షిప్తం చేశారు. అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబర్‌ను నమోదు చేస్తే.. సర్టిఫికెట్‌ అసలుదో.. నకిలీదో తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ పోర్టల్‌ అందుబాటులోకి వస్తే ప్రపంచంలో ఎవరైనా.. ఎప్పుడైనా సులభంగా వెరిఫికేషన్‌ చేయించుకోవచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలు, ప్రవేశాలు కల్పించే విద్యాసంస్థలు ఈ పోర్టల్‌ ద్వారా సులభంగా సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేయించుకోవచ్చని, విద్యార్థుల మెమోలు కావాలనుకుంటే ఆన్‌లైన్‌లో డిజిటల్‌ సంతకం చేసి పంపిస్తారని వెల్లడించారు.


నకిలీ సర్టిఫికెట్ల బెడదను అరికట్టేందుకు ఇకనుంచి విద్యార్థుల సర్టిఫికెట్లన్నింటినీ డిజిలాకర్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఉన్నత విద్యామండలి గతంలోనే తెలిపింది. అనుమానం వచ్చినవారు ఎప్పుడంటే అప్పుడు ఒకే ఒక్క క్లిక్‌తో వీటిని పరిశీలించుకోవచ్చు. డిజిలాకర్‌తోపాటు సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.


డిజిటలైజేషన్‌ బాటలో ఉస్మానియా వర్సిటీ!
ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా మరో కీలక ముందడుగు వేసింది. పరీక్షల విభాగం ఆటోమేషన్ చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. దశాబ్దాలుగా ఉన్న రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించారు. ఇటీవల ఔరంగాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ధ్రువపత్రాన్ని పరిశీలించాలని అక్కడి కోర్టు ఆదేశించింది. 1930కి చెందిన రికార్డు కావడంతో సేకరించడం ఇబ్బందిగా మారింది. దీనికితోడు అప్పటి ధ్రువపత్రాలన్నీ ఉర్దూలో ఉన్నాయి. ఎట్టకేలకు వెతికి పట్టుకున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయ రికార్డులన్నీ పరీక్షల విభాగంలో జాగ్రత్తగా పొందుపరిచారు. లక్షల సంఖ్యలో ఉన్న రికార్డుల్లో.. అవసరమైన పత్రాలను భౌతికంగా వెతికి తీసుకోవడం కష్టమవుతోంది. ఇప్పటివరకు ఓయూ పరీక్షల విభాగంలో 2009 తర్వాత రికార్డులు, ధ్రువపత్రాలే డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. మిగతావీ కంప్యూటరీకరించేందుకు శ్రీకారం చుట్టారు.


ఇప్పటికే డిగ్రీ, పీజీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఆన్‌లైన్‌లో చేస్తున్నారు. ఏటా వర్సిటీ పరిధిలో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. ఆన్‌స్క్రీన్ మూల్యాంకనంలో భాగంగా జవాబు పత్రాలన్నీ స్కాన్ చేసి కంప్యూటరీకరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో సంబంధిత సబ్జెక్టు అధ్యాపకులకు పంపించి దిద్దిస్తున్నారు. ఏ జవాబుపత్రం ఎవరు దిద్దుతున్నారో బయటకు తెలియదు. ధ్రువపత్రాలు పొందేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను ఓయూ తీసుకొచ్చింది. ప్రస్తుతం కొన్ని విభాగాలకే పరిమితమైంది.త్వరలో పూర్తిస్థాయిలో సేవలందించేలా తీర్చిదిద్దుతున్నారు. ధ్రువపత్రాల జారీ నుంచి, పాత రికార్డులన్నీ జూన్ కల్లా డిజిటలైజ్ కానున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొ.బి.నగేశ్ తెలిపారు. దరఖాస్తు చేసిన 24 గంటల్లో సర్టిఫికెట్లు ఇవ్వాలన్నది లక్ష్యం.



:: Also Read ::


KNRUHS: యూజీ ఆయూష్‌ కోర్సుల్లో ప్రవేశాలు, నేటి నుంచి దరఖాస్తులు

యూజీ ఆయూష్‌ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆయూష్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎన్‌వైఎస్‌ కోర్సులల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నవంబరు 12న నోటిఫికేషన్‌ జారీ చేసింది. 50 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీకు 40 శాతం, దివ్యాంగుకు 45 శాతం మార్కులు) ఇంటర్‌ (బైపీసీ) ఉత్తీర్ణులై , నీట్‌-2022లో అర్హత సాధించిన అభ్యర్ధులు నవంబరు 13న ఉదయం 8 గంటల నుండి నవంబరు 20న రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వారు సూచించారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్ధులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
కోర్సుల వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.. 

 

విద్యార్థులకు జేఎన్​టీయూ గుడ్ న్యూస్, ఇక ఒకేసారి రెండు డిగ్రీలు!
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా డ్యూయల్‌ డిగ్రీ కోర్సుకు జేఎన్‌టీయూ శ్రీకారం చుట్టింది. బీటెక్‌తో పాటు బీబీఏ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు వారం రోజుల్లో బీబీఏ(డేటా అనలిటిక్స్‌)లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌తోపాటు అడ్మినిస్ట్రేటివ్‌ నైపుణ్యాలు ఉంటే సులువుగా ఉద్యోగాలు పొందే వీలుంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
కోర్సులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..