తెలంగాణలో పదోతరగతి తరహాలోనే ఇంటర్‌లోనూ మార్కులకు బదులు గ్రేడింగ్ విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై సమాలోచనలు చేస్తోంది. మార్కుల పోటీతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి ఉండడం, పలువురు ఆత్మహత్యకు పాల్పడుతున్న నేపథ్యంలో గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ) ఇస్తే కొంతవరకైనా మానసిక ఒత్తిడి తగ్గుతుందని భావిస్తోంది. కొన్నేళ్ల నుంచి జేఈఈ మెయిన్, నీట్ ర్యాంకుల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదు. ఈసారి నుంచి ఎంసెట్‌కూ శాశ్వతంగా వెయిటేజీ తొలగించారు. ఈ క్రమంలో ఇంటర్‌లో మార్కుల బదులు గ్రేడ్లు ఇస్తే మన విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఏమైనా సమస్య వస్తుందా? తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు నిపుణుల కమిటీని నియమించాలని భావిస్తోంది.


ఇంటర్ విద్య ఐక్య కార్యచరణ ఛైర్మన్ డాక్టర్ పి.మధుసూదన్ రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ.. రాష్ట్ర, జాతీయ ప్రవేశ పరీక్షల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదని చెప్పారు. ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో చేరేటప్పుడు కనీసం 75% మార్కులు అడుగుతారని, అలాంటప్పుడు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలకూ ఇంటర్ మార్కులే ఆధారంగా ఉన్నందున నిపుణుల కమిటీ వేస్తే ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు. ఇప్పుడు ఇంటర్ మార్కుల కంటే జేఈఈ, నీట్ ర్యాంకులు వస్తాయో?రావో? అన్న దానిపైనే అధికంగా ఒత్తిడి ఉంది అని నానో అకాడమీ సంచాలకుడు కృష్ణ చైతన్య అభిప్రాయపడ్డారు.


ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్‌ ప్రవేశాలు?
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలను 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్ విధానం ద్వారా చేపట్టే యోచన చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. ఇంటర్ ఫలితాల వెల్లడి సందర్భంగా వీరు విలేకర్లతో మాట్లాడారు. ఇంటర్ ప్రవేశాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఆన్‌లైన్‌లో ప్రవేశాలు జరుపుతారా అని ప్రశ్నించగా... ఈసారికి పాత పద్ధతిలోనే నిర్వహిస్తామని, ఆపై వచ్చే విద్యాసంవత్సరంలో ఆన్‌లైన్‌ విధానంలో ప్రవేశాలు కల్పించేందుకు యోచిస్తున్నామన్నారు. జూన్ 1 నుంచి ఇంటర్ రెండో సంవత్సరంతో పాటు తొలి ఏడాది విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. త్వరలో ప్రవేశాల షెడ్యూల్ జారీ చేస్తామని, మరో నాలుగైదు రోజుల్లో ప్రైవేట్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ కళాశాలలతో పాటు కొన్ని ప్రైవేట్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చామన్నారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ఆన్‌లైన్ విధానంలో చేస్తారా అని ప్రశ్నించగా.. దానిగురించి తర్వాత మాట్లాడదామని మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో దాదాపు 400 కళాశాలలకు అగ్నిమాపక ఎన్‌ఓసీ లేదని, కాకపోతే వచ్చే విద్యాసంవత్సరం(2023-24) వరకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చిందని నవీన్ మిట్టల్ తెలిపారు. ఆ కళాశాలల్లో చేరే విద్యార్థులు వాటికి ఎన్‌ఓసీ లేదన్న విషయం తెలుసని హామీపత్రం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


పది‌లోనూ ఆన్‌లైన్ మూల్యాంకనం!
పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో కూడా ఆన్‌లైన్ విధానాన్ని (ఆన్‌స్క్రీన్ ఎవాల్యుయేషన్) అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఆలోచన చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన తెలిపారు. అదనపు జవాబుపత్రాలు తీసుకుంటే ఇంటర్ తరహాలో బుక్‌లెట్‌గా ఇవ్వాలని, ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయాలంటే అది తప్పనిసరని అన్నారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..