బంగాళాదుంపలు అంటే పిల్లలకూ, పెద్దలకు కూడా చాలా ఇష్టం. వాటితో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ దుంపలకు చాలా విలువ ఉంది. ఇవి చాలా తక్కువ ధరకే దొరకడం వల్ల తినేవారి అధికంగా ఉంది. అంతేకాదు ఏడాది పొడువునా ఇవి పండుతాయి. కాలంతో పనిలేదు. అందుకే అధికంగా మార్కెట్లలో దొరుకుతాయి. కిలో 20 నుంచి 30 రూపాయలకే లభిస్తాయి. కాబట్టి పేదవారు కూడా వీటిని అధికంగా తింటారు. అయితే వీటిలో ఒక రకమైన దుంప ఉంది. వాటిని కొనాలంటే మాత్రం నెల జీతం ఖర్చు పెట్టుకోవాల్సిందే. వీటిని కేవలం ఫ్రాన్స్ లో మాత్రమే పండిస్తారు. ఈ బంగాళదుంపల రకం పేరు ‘లే బోనోట్’. 


ఎంత ఖరీదు?
లే బోనోట్ బంగాళాదుంపలను కొనాలంటే కిలోకు 50 వేల నుంచి 90 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాలి. బంగాళదుంపల నాణ్యత పై ధర ఆధారపడి ఉంటుంది. తక్కువ నాణ్యత గలవి 50వేల రూపాయలకే లభిస్తాయి. ఎక్కువ నాణ్యత ఉంటే 90,000 వరకు ఖర్చు పెట్టాలి.


ఎందుకంత ఖరీదు?
ఈ బంగాళదుంపలు ఎందుకంత ధర పలుకుతాయంటే... వాటిని చాలా తక్కువగా ఉత్పత్తి  చేస్తారు. ఇవి మే, జూన్ కాలంలో మాత్రమే పండుతాయి. అట్లాంటిక్ మహాసముద్రంలోని లోయర్ ప్రాంతంలో ఉన్న దీవి నోయిర్‌మౌటియర్‌‌లో మాత్రమే ఇవి పండుతాయి. వీటి రుచి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. డిమాండ్ అధికం. అందుకే ఈ బంగాళదుంపల ధర అమాంతం కొండెక్కి కూర్చుంది. వాటిని మొదటిగా పండించిన వ్యక్తి పేరు బెనోయిట్ బోనోట్. అతని పేరే ఈ బంగాళదుంపలకు పెట్టారు. ఈ దుంపలను సాంప్రదాయ పద్ధతుల్లో పెంచుతారు. నాటడం దగ్గర నుంచి కోయడం వరకు అన్నీ చేతితోనే చేస్తారు. ఎలాంటి మెషీన్లను ఉపయోగించరు. అందుకే వీటి పెంపకం కూడా కష్టం.


ఇవి గోల్ఫ్ బాల్ సైజులో పండుతాయి. పలుచని  తొక్కని కలిగి ఉంటాయి. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. ఫ్రాన్స్ లోని పెద్దపెద్ద రెస్టారెంట్లలో వీటి వంటకాలు లభిస్తాయి. కాకపోతే వాటి ధరలు కూడా ఆకాశంలో ఉంటాయి. రుచిలో, పోషకాలు అందించడంలో ఇవి ముందుంటాయి. వీటిని తినడం వల్ల అదనంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీటిని సేంద్రియ పద్ధతుల్లో పండిస్తారు కాబట్టి తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రావు.  వీటితో ఫ్రాన్స్ లో రకరకాల వంటకాలు సిద్ధం చేస్తారు.


Also read: షాపింగ్ చేసే సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీకు డిమెన్షియా వచ్చినట్టే లెక్క


Also read: రెటినోబ్లాస్టోమా, కంటికి వచ్చే క్యాన్సర్ ఇది - జాగ్రత్త పడకపోతే చూపు పోతుంది


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.