Chennai Super Kings vs Delhi Capitals: చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్ 55వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిల్ ఓవర్లలో చాలా నిదానంగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ చేజేతులా ఓటమి పాలైంది. ఈ ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్ ట్రోఫీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే.
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రిలీ రౌసో (35: 37 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మనీష్ పాండే (27: 29 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) ఆ తర్వాతి ప్లేస్‌లో ఉన్నాడు. పాతిక పరుగులు చేసిన శివం దూబేనే (25: 12 బంతుల్లో, మూడు సిక్సర్లు) చెన్నై సూపర్ కింగ్స్ తరఫున టాప్ స్కోరర్. ఢిల్లీ బౌలర్లలో మిషెల్ మార్ష్ మూడు వికెట్లు తీసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. చెన్నై బ్యాటర్లలో ఒక్క బ్యాటర్ కూడా రాణించలేదు. 25 పరుగులే జట్టులో టాప్ స్కోర్. కానీ వచ్చిన వారందరూ చిన్న చిన్న క్యామియోలు ఆడారు. ఈ సిరీస్‌లో మంచి ఫాంలో ఉన్న ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (24: 18 బంతుల్లో, నాలుగు ఫోర్లు), డెవాన్ కాన్వే (10: 13 బంతుల్లో, ఒక ఫోర్) ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యారు. అజింక్య రహానే కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు.
అయితే శివం దూబే (25: 12 బంతుల్లో, మూడు సిక్సర్లు), అంబటి రాయుడు (23: 17 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), రవీంద్ర జడేజా (21: 16 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఇలా వచ్చిన వాళ్లు వచ్చినట్లు చెలరేగారు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడు మహేంద్ర సింగ్ ధోని (20: 9 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) మెరుపు సిక్సర్లతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మతీషా పతిరనా, సుభ్రాంశు సేనాపతి, మిచ్ సాంట్నర్, ఆకాష్ సింగ్, షేక్ రషీద్
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, రిపాల్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ముఖేష్ కుమార్, మనీష్ పాండే, ప్రవీణ్ దూబే, అభిషేక్ పోరెల్, చేతన్ సకారియా