Dementia: డిమెన్షియా... దీన్నే చిత్తవైకల్యం అని కూడా అంటారు. జ్ఞాపకశక్తిని, ఆలోచనా సామర్ధ్యాలను ప్రభావితం చేసే ఒక మానసిక వైకల్యం ఇది. ఒక రకమైన అల్జీమర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. డిమెన్షియా వల్ల రోజువారి జీవితం చాలా ప్రభావితం అవుతుంది. మాట్లాడే భాష, సమస్యను పరిష్కరించే సామర్థ్యం, నిర్ణయం తీసుకునే ఆలోచన కోల్పోతూ ఉంటారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది.  డిమెన్షియా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి షాపింగ్ చేసే సమయంలో మీ ప్రవర్తనను మీరే గమనించుకోవాలి. కొన్ని రకాల లక్షణాలు ఆ సమయంలోనే బయటపడతాయి. వాటిని హెచ్చరిక సంకేతాలుగా భావించి వైద్యులను సంప్రదించాలి. ఈ వ్యాధి ఉన్నవారు షాపింగ్ చేసే సమయంలో డబ్బులు చెల్లించేటప్పుడు తత్తర పడుతుంటారు. ఎంత మొత్తాన్ని ఇవ్వాలి? ఎంత చిల్లర తిరిగి తీసుకోవాలి? అనే విషయంలో కాస్త కంగారు పడుతుంటారు.


ఈ చిత్తవైకల్యం ఉన్నవారు తరచూ షాపింగ్ కి వెళ్లడం, ఉద్దేశపూర్వకంగా ఏదో ఒకటి కొనుగోలు చేయడం చేస్తుంటారు. ఏది కొనుగోలు చేసామనే విషయాన్ని కూడా మర్చిపోతుంటారు. మళ్ళీ మళ్ళీ అదే వస్తువును కొంటూ ఉంటారు. మూడు స్వింగ్స్ అధికంగా ఉంటాయి. గందరగోళంగా ఉండడం, ప్రతిదాన్ని అనుమానించడం, నిరాశగా కనిపించడం వంటివన్నీ వస్తాయి. వారి మానసిక స్థితి విచిత్రంగా ఉంటుంది. ముఖ్యంగా వారి రోజువారీ దినచర్య మారినప్పుడు, వారి కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకొచ్చినప్పుడు వారు విచిత్రంగా ప్రవర్తిస్తారు. త్వరగా కలత చెందుతారు. అయితే ఈ సమస్య ఉన్నవారు తమలోని మార్పులను గుర్తించలేరు, కేవలం వారి కుటుంబ సభ్యులే దీన్ని గుర్తించాలి. 


డిమెన్షియా పెరుగుతున్న కొద్ది ఆ వ్యక్తి చూపు కూడా మందగిస్తుంది. శ్రద్ధ, ఏకాగ్రత తగ్గిపోతుంది. ఎప్పుడు పరధ్యానంగా ఉంటారు. ఇంతకుముందు ఏమి చేశారో మర్చిపోతారు. డిమెన్షియా ఉన్నవారు నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. రెండు వస్తువులు చూపించి... రెండిట్లో ఏది కావాలి అని అడిగితే అలా ఎంపిక చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. తమను అలంకరించుకోవడానికి ఇష్టపడరు. కారులో పెట్రోల్ వేయించుకోవడం లాంటి పనులు వారికి నచ్చవు. అంతే కాదు ఒక్కసారిగా ఆకస్మిక నిర్ణయాలు మార్చుకుంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వారు ఏం చేస్తారో ఊహించడం కూడా కష్టంగా ఉంటుంది.  ఇలాంటి లక్షణాలు మీ కుటుంబ సభ్యుల్లో కనిపిస్తే వారికి డిమెన్షియా ఉందేమో అని వైద్యులను కలిసి చెక్ చేయించుకోవడం మంచిది. దీనికి  మందుల ద్వారానే చికిత్స అందిస్తారు. ఎలాంటి ఆపరేషన్లు అవసరం ఉండదు. 



Also read: రెటినోబ్లాస్టోమా, కంటికి వచ్చే క్యాన్సర్ ఇది - జాగ్రత్త పడకపోతే చూపు పోతుంది


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.