నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం ఈ రోజు ఉదయం 5:30కి అదే ప్రదేశంలో తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సుమారుగా కొంత సమయం వాయువ్యదిశగా కదిలి ఆ తర్వాత ఉత్తర - వాయవ్య దిశ వైపుగా కదులుతూ క్రమంగా బలపడి ఈ రోజు సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇది క్రమంగా ఉత్తర - వాయువ్య దిశల వైపుగా కదులుతూ రేపు 11వ తేదీ ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పారు. 



మళ్లీ క్రమంగా బలపడుతూ 12వ తారీకు ఉదయానికి, ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లోని మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత తన దిశను మార్చుకుని ఉత్తర - ఈశాన్య దిశల వైపు కదులుతూ క్రమంగా బలహీనపడి ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ తీరాల మధ్యలో  Cox's Bazar (బంగ్లాదేశ్), Kyaukpyu (మయన్మార్) వద్ద 14వ తేదీ మధ్యాహ్నం గాలి వేగం 110-120 కిలో మీటర్ల వేగంతో తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు.


తెలంగాణపై ఎఫెక్ట్ ఇలా
దీని ప్రభావం వలన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపటి నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు నుండి గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి రాష్ట్రంలో కొన్ని చోట్ల  సుమారుగా 41 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో సుమారుగా 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది.






హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 28 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. వాయువ్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 61 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కూడా వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుందని అధికారులు తెలిపారు. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ ఎక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.