New Education Commission in Telangana: తెలంగాణ విద్యా వ్యవస్థలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించగా... ఎట్టకేలకు అది కార్యరూపం దాల్చింది. ఈ మేరకు తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సెప్టెంబరు 3న ఉత్తర్వులు (జీవో 27) జారీ చేశారు. రెండేళ్ల కాలపరిమితితో ఈ కమిషన్ పనిచేయనుంది. కొత్తగా ఏర్పాటు కాబోయే ఈ కమిషన్‌కు త్వరలోనే ఛైర్మన్, ముగ్గురు సభ్యులను నియమించనున్నారు. వీరితోపాటు హెచ్‌వోడీ స్థాయి ఐఏఎస్ అధికారిని మెంటర్ సెక్రటరీగా నియమించనున్నారు. కమిషన్ కార్యాలయాన్ని సచివాలయం లేదా ప్రజాభవన్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
రాష్ట్రంలో విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి గతంలో పలు పర్యాయాలు స్పష్టంచేశారు. ఇందుకోసం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతంపై చర్చించేందుకు విద్యావేత్తలతో గతంలో భేటీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా విద్యా కమిషన్ ఏర్పాటుకు పచ్చజెంగా ఊపారు.
సమగ్ర విధానాల రూపకల్పనే లక్ష్యంగా..
ప్రీ-ప్రైమరీ నుంచి వర్సిటీ విద్య వరకు సమగ్ర విధానాల రూపకల్పన లక్ష్యంగా ఈ కమిషన్ పనిచేయనుంది. ప్రభుత్వానికి సిఫారసులు చేసేందుకు కమిషన్ వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృత సంప్రదింపులు జరపొచ్చు. లక్ష్యాల సాధనకు అవసరమైతే నిపుణులను, కన్సల్టెంట్లను, వృత్తి నిపుణులను నియమించుకోవచ్చు. డిప్యుటేషన్ లేదా ఓడీపై విద్యాశాఖలోని ఉద్యోగుల సేవలను వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఈ కమిషన్‌కు రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులను కేటాయించనున్నారు. అదేవిధంగా ప్రైవేట్ రంగంతోపాటు వివిధ భాగస్వామ్య పక్షాల నుంచి విరాళాలు కూడా పొందొచ్చు.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పబ్లికేషన్ల సంఖ్య తగ్గడం, పరిశోధన కార్యకలాపాలు కుంటుపడుతుండటంతో.. మార్కెట్ అవసరాలకు కావాల్సిన నిపుణుల కొరత ఏర్పడుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర మార్పులకు రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనుంది. ఆ బాధ్యతలను విద్యాకమిషన్‌కు అప్పగించింది. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ కమిషన్ ప్రభుత్వానికి సూచనలు చేయనుంది.
కమిషన్ నిర్వర్తిచే విధులు..
➥ విద్యావ్యవస్థలో నాణ్యతకు అవసరమైన విధానాలను రూపొందించి ప్రభుత్వానికి సిఫారసు చేయడం.
➥ ప్రాథమిక నుంచి ఉన్నత విద్య వరకు తరగతికి తగిన నైపుణ్యాలుండేలా విద్యార్థులను తయారు చేయడం.
➥ శిశు విద్య, పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు కృషి. ప్రధానంగా విద్యార్థుల సమగ్రాభివృద్ధిపై దృష్టి. ఉన్నత విద్యాసంస్థలైన కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించడం.
➥ విద్యారంగంలో మార్పులను ఆకళింపు చేసుకొని... దానికి అనుగుణంగా విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడంపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం.
➥విధాన పత్రాల రూపకల్పనకు సంప్రదింపులు, మార్గదర్శకాలు, నిబంధనలు, పైలట్ అధ్యయనాలు తదితర వాటి కోసం ఈ కమిషన్ సహకరించనుంది. ➥ విద్యాసంస్థల్లో అప్రెంటిస్‌షిప్, ఉద్యోగ నైపుణ్యాలను అనుసంధానం చేయడం.
➥ నైతిక విద్యను అందిస్తూ ఉత్తమ, బాధ్యతాయుత ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడం. ఎప్పటికప్పుడు విద్యారంగానికి సంబంధించి అవసరమైన పరిశీలన చేసి సిఫారసులు చేయడం.