'35 చిన్న కథ కాదు' (35 Chinna Katha Kadu Movie) సినిమాతో ఈ శుక్రవారం (సెప్టెంబర్ 6న) థియేటర్లలోకి వస్తున్నారు నివేదా థామస్ (Nivetha Thomas). తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. ఈ రోజు, రేపు (సెప్టెంబర్ 4, 5 తేదీల్లో) ప్రీమియర్లు వేస్తున్నారు. ఆల్రెడీ కొంత మంది ప్రముఖులు సినిమా చూశారు. వారిలో న్యాచురల్ స్టార్ నాని ఉన్నారు. ప్రీ రిలీజ్ వేడుకలో ఈ సినిమా గురించి ఆయన ఏమన్నారంటే?
అరుదైన సినిమా... పిల్లల్ని స్కూల్ మాన్పించి మరీ
ఈ మధ్య కాలంలో నేను చూసిన అందమైన తెలుగు సినిమా '35 చిన్న కథ కాదు' అని నాని చెప్పారు. ఇది యువతకు ఎక్కుతుందా? లేదంటే మాస్, క్లాస్ జనాలు చూస్తారా? వంటివి తనకు తెలియదని, కానీ ప్రతి అమ్మ, ప్రతి నాన్న వాళ్ల పిల్లల్ని తీసుకుని వెళ్లాల్సిన సినిమా అని నాని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యే సినిమా. నివేదా థామస్ చెప్పినట్టు... మీ పిల్లలు ఒక్క రోజు స్కూల్ ఏమైనా మిస్ అయినా సరే నష్టం ఏమీ లేదు. ఆ రోజు థియేటర్లలో ఎక్కువ నేర్చుకుంటారు. నాకు 'సరిపోదా శనివారం' లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ వస్తాయేమో కానీ '35 చిన్న కథ కాదు' లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. అందుకని, పొరపాటున కూడా మిస్ కాకండి '' అని చెప్పారు నాని.
నివేదా థామస్ పొరపాటున అబద్ధం చెప్పదు
'జెంటిల్‌మన్' సినిమాతో నివేదా థామస్ తనకు పరిచయమైందని, తమ ఇంట్లో ఓ మనిషి అయ్యిందని చెప్పారు నాని. ఆవిడ మీద ప్రశంసలు కురిపించారు. ఆమె పొరపాటున కూడా అబద్ధం చెప్పదని వివరించారు. ఆవిడ ఏ పని చేసినా సరే 100 పర్సెంట్ ఇస్తుందన్నారు. థియటర్లలో నివేదాను చూసినప్పుడు ప్రతి అమ్మ ఆ పాత్రతో కనెక్ట్ అవుతుందని నాని తెలిపారు. హీరో విశ్వదేవ్ సర్‌ప్రైజ్ చేశాడని తెలిపారు. స్క్రీన్ మీద ప్రసాద్ పాత్ర తప్ప మరొకటి గుర్తు రాలేదన్నారు.
Also Read: శ్రీను వైట్ల మార్క్ కామెడీతో 'విశ్వం' టీజర్ - వైఎస్ జగన్‌ను వాడేసిన గోపీచంద్
తెలుగు సినిమాకు ఆమిర్ ఖాన్ లాంటోడు ప్రియదర్శి
తనకు వ్యక్తిగతంగా ఇష్టమైన వ్యక్తి ప్రియదర్శి అని చెప్పారు నాని. అంతే కాదు... తను ఎంపిక చేసుకునే పాత్రలు గానీ, పెర్ఫెక్షన్ కోరుకునే విధానం చూస్తుంటే ఆమిర్ ఖాన్ అనిపిస్తాడని ఆయన వివరించారు. ''ప్రియదర్శి గనుక మన తెలుగు సినిమా ఆమిర్ ఖాన్... అతని ఫిల్మోగ్రఫీలో 'తారే జమీన్ పర్' లాంటి సినిమా '35 చిన్న కథ కాదు'. అందులో డౌట్ లేదు'' అని నాని తెలిపారు.
నివేదా థామస్, విశ్వదేవ్ రాచకొండ జంటగా నటించిన '35 చిన్న కథ కాదు'లో ప్రియదర్శి పులికొండ టీచర్ రోల్ చేశారు. గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ, అరుణ్ దేవ్, అభయ్, అనన్య ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్ సౌమిత్రి, క్రియేటివ్ నిర్మాత: శివాని దోభాల్, పాటలు: కిట్టు విస్సాప్రగడ - భరద్వాజ్ గాలి, మాటలు: నంద కిశోర్ ఈమాని - ప్రశాంత్ విఘ్నేష్ అమరావతి, కూర్పు: టీసీ ప్రసన్న, ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణ సంస్థలు: సురేష్ ప్రొడక్షన్స్ - ఎస్ ఒరిజినల్స్ - వాల్టెయిర్ ప్రొడక్షన్స్, నిర్మాతలు: రానా దగ్గుబాటి - సృజన్ యరబోలు - సిద్ధార్థ్ రాళ్లపల్లి, రచన - దర్శకత్వం: నంద కిశోర్ ఈమాని.