మాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా రూపొందుతున్న స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'విశ్వం' (Viswam Movie). శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనేపూడితో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు. శ్రీను వైట్ల మార్క్ కామెడీ, గోపీచంద్ నుంచి ఆడియన్స్ ఆశించే యాక్షన్... రెండిటితో రూపొందిన ఈ టీజర్ ఎలా ఉందో ఓ లుక్ వేయండి.
గీతా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప ఏమీ తెలియదు!
శ్రీను వైట్ల అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది 'వెంకీ' సినిమాలో ట్రైన్ సీక్వెన్స్. అందులో ఫన్ భలే ఉంటుంది. అటువంటి సీక్వెన్స్ 'విశ్వం' సినిమాలో ఉందని ఆయన ముందుగా చెప్పారు. 'ది జర్నీ ఆఫ్ విశ్వం' గ్లింప్స్‌లోనూ ట్రైన్ సీక్వెన్స్ గురించి హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ కామెడీ టీజర్‌లో కనిపించింది.
'నీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసా?' అని గోపీచంద్ అడిగితే... 'నాకు గీతా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప మరే ఆర్ట్స్ తెలియదు' అని వీటీవీ గణేష్ సమాధానం ఇచ్చారు. అక్కడ టైమింగ్ కుదిరింది. ఈ తరహా పంచ్ డైలాగులు సినిమాలో ఎన్ని ఉన్నాయో మరి!? టీజర్ మొత్తం మీద హైలైట్ అంటే వైఎస్ జగన్ డైలాగును గోపీచంద్ చెప్పడం. 'కొట్టారు... తీసుకున్నాం! రేపు మాకూ టైమ్ వస్తుంది. మేమూ కొడతాం' అని వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన డైలాగును హీరో చేత చెప్పించారు శ్రీను వైట్ల. విచిత్రం ఏమిటంటే... జగన్ అధికారంలో ఉన్నప్పుడు సినిమా మొదలైంది. ఆయన ప్రతిపక్షంలోకి వచ్చిన సమయంలో టీజర్ విడుదలైంది.
గోపీచంద్ యాక్షన్ గురించి ఆడియన్స్ అందరికీ తెలుసు. అయితే, ఆ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ కొత్తగా కనిపించింది. ఇందులో గోపీచంద్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
అక్టోబర్ 11న 'విశ్వం' విడుదల
Viswam Movie Release Date: టీజర్ విడుదల చేయడంతో పాటు 'విశ్వం' రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. అక్టోబర్ 11న థియేటర్లలోకి ఈ సినిమాను తీసుకు వస్తామని చెప్పారు.
గోపీచంద్, కావ్య థాపర్, 'వెన్నెల' కిశోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కొల్లి సుజిత్ కుమార్ - ఆదిత్య చెంబోలు, కూర్పు: అమర్ రెడ్డి కుడుముల, రచయితలు: గోపీ మోహన్ - భాను అండ్ నందు - ప్రవీణ్ వర్మకళా దర్శకుడు: కిరణ్ కుమార్ మన్నె, ఫైట్ మాస్టర్: రవి వర్మ - దినేష్ సుబ్బరాయన్, నిర్మాణ సంస్థలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - చిత్రాలయం స్టూడియోస్, ఛాయాగ్రహణం: కేవీ గుహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, క్రియేటివ్ నిర్మాత: కృతి ప్రసాద్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సమర్పణ: దోనేపూడి చక్రపాణి, నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ - వేణు దోనేపూడి, దర్శకత్వం: శ్రీను వైట్ల.