ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందువల్ల, నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాలకు కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. రెండు తెలుగు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టాయి. వాళ్ల సహాయార్థం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భారీ విరాళం ప్రకటించారు.


ఏపీ, తెలంగాణకు ఎన్టీఆర్ కోటి విరాళం
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, అభిమానులు ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయడానికి ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటారు. కరోనా సమయంలో, అంతకు ముందు హుద్ హుద్ వచ్చినప్పుడు భారీ మొత్తాన్ని ఇచ్చారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సహాయక చర్యల కోసం కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు. 


''రెండు తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ) ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంత గానో కలచి వేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నా. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయ పడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరొక రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నా'' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మొత్తం మీద ఎన్టీఆర్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు.






Also Read: నాలుగు వారాలకే ఓటీటీలోకి 'సరిపోదా శనివారం' - నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యేది ఆ రోజే?



పది లక్షలు విరాళం ఇచ్చిన యువ హీరో విశ్వక్ సేన్!
యువ కథానాయకుడు, ఎన్టీఆర్ వీరాభిమాని విశ్వక్ సేన్ సైతం ఏపీలో వరద విపత్తు సహాయక చర్యల కోసం ఐదు లక్షలు విరాళం ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఏపీకి ఐదు లక్షలతో పాటు తెలంగాణకు మరొక ఐదు లక్షల విరాళం ప్రకటించారు. మొత్తం మీద ఆయన పది లక్షలు ఇచ్చారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కు చెందిన వైజయంతి మూవీస్ రూ. 25 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. 






Also Read'బిగ్ బాస్ 8'లోకి కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ... హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్ బ్యాగ్రౌండ్ ఇదే