No Weightage for Inter Marks in TS EAMCET 2022: త్వరలో ఇంటర్ ఎగ్జామ్స్, ఎంసెట్ ఎంట్రన్స్ నేపథ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ ఎంసెట్ 2022లో ర్యాంకులు కేటాయించడానికి ఇంటర్ పాస్ అయితే చాలు అని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో అయితే ఇంటర్ వెయిటేజీకి సైతం ఎంసెట్ ర్యాంకులలో ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే ఎంసెట్ ర్యాంకులు కేటాయించడానికి ఇంటర్ పాస్ అయితే చాలని విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 


పాత నిబంధనల ప్రకారం ఎంసెట్ ర్యాంకు (Telangana EAMCET 2022) కేటాయించాలంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్‌లో 45 శాతం, ఇతర కేటగిరీల వారికి 40 శాతం మార్కులు తప్పనిసరి ఉండాలి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు మినిమం మార్కులతో ఇంటర్ పాస్ అయితే చాలు అని గుడ్ న్యూస్ చెప్పారు. మరోవైపు ఎంసెట్ ర్యాంకులలో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది. 


ఎంసెట్ మార్కులతోనే ర్యాంకులు
మరికొన్ని రోజుల్లో నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్ 2022లో వచ్చిన మార్కులతోనే విద్యార్థులకు ఎంసెట్ ర్యాంకును కేటాయిస్తారు. ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణత(Intermediate) సాధించిన విద్యార్థులు ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చర్‌, మెడిక‌ల్ కోర్సులో చేరేందుకు ఎంసెట్ పరీక్ష రాయాల్సి ఉంది. ఎంసెట్(EAMCET) ప‌రీక్షను జేఎన్‌టీయూ, హైద‌రాబాద్‌ నిర్వహిస్తుంది. టెక్నాలజీ, ఇంజినీరింగ్(Engineering Courses) కోర్సుల్లో ప్రవేశాలు పొంద‌డానికి అభ్యర్థులు ఇంటర్ లో మ్యాథ‌మెటిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యోటెక్నాల‌జీ, బ‌యోల‌జీ స‌బ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఆప్షన‌ల్, ఒకేష‌న‌ల్ కోర్సుల పాస్ అయి లేదా డిప్లొమా చివ‌రి ఏడాది చ‌దువుతున్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. 


ఎంసెట్ అగ్రిక‌ల్చర్(Agriculture), మెడిక‌ల్(Medical) పరీక్షను జూన్ 14, 15వ తేదీల్లో, ఇంజినీరింగ్ పరీక్షను జూన్‌ 18, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నారు. నోటిఫికేష‌న్ స‌మాచారం, ద‌ర‌ఖాస్తు విధానం(Application Process) గురించి తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్‌ https://eamcet.tsche.ac.in/ ను సందర్శించవచ్చు. ఈసారి  ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎంసెట్ కు ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో కనీస మార్కులతో విద్యార్థులను ప్రమోట్‌ చేశారు. దీంతో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఎంసెట్‌ అర్హత మార్కులు 40 శాతం ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 


Also Read: TS EAMCET 2022 : తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష తేదీలివే?


Also Read: TSRJC CET 2022: టెన్త్ క్లాస్ విద్యార్థులకు శుభవార్త - దరఖాస్తులకు గడువు పొడిగించిన టీఎస్ఆర్ జేసీ