TS EAMCET 2022 : తెలంగాణ ఎంసెట్ 2022 అధికారిక నోటిఫికేషన్(Notification) సోమవారం విడుదల అయింది. ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణత(Intermediate) సాధించిన విద్యార్థులు ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చర్‌, మెడిక‌ల్ కోర్సులో చేరేందుకు ఎంసెట్ పరీక్ష రాయాల్సి ఉంది. ఎంసెట్(EAMCET) ప‌రీక్షను జేఎన్‌టీయూ, హైద‌రాబాద్‌ నిర్వహిస్తుంది. టెక్నాలజీ, ఇంజినీరింగ్(Engineering Courses) కోర్సుల్లో ప్రవేశాలు పొంద‌డానికి అభ్యర్థులు ఇంటర్ లో మ్యాథ‌మెటిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యోటెక్నాల‌జీ, బ‌యోల‌జీ స‌బ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఆప్షన‌ల్, ఒకేష‌న‌ల్ కోర్సుల పాస్ అయి లేదా డిప్లొమా చివ‌రి ఏడాది చ‌దువుతున్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. 


పరీక్షల తేదీలివే? 


ఎంసెట్ అగ్రిక‌ల్చర్(Agriculture), మెడిక‌ల్(Medical) పరీక్షను జూన్ 14, 15వ తేదీల్లో, ఇంజినీరింగ్ పరీక్షను జూన్‌ 18, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఎంసెంట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వాళ్లు రూ. 400, మిగ‌తా కేట‌గిరీల అభ్యర్థులు రూ. 800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎంసెట్ కు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇంజినీరింగ్, మెడిక‌ల్ ప్రవేశ ప‌రీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్(SC, ST, PH) అభ్యర్థులు రూ. 800, మిగ‌తా కేట‌గిరిల అభ్యర్థులు రూ. 1600 దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫికేష‌న్ స‌మాచారం, ద‌ర‌ఖాస్తు విధానం(Application Process) గురించి తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్‌ https://eamcet.tsche.ac.in/ ను సందర్శించవచ్చు. 


ఇంటర్ మార్కుల వెయిటేజ్





ఎంసెట్‌ పరీక్ష పూర్తైన నెల రోజుల్లోపు ఎంసెట్‌ ర్యాంకులు ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో తెలంగాణ ఎంసెట్‌కు ఇంటర్‌ మార్కుల(Inter Marks) వెయిటేజ్‌ కలిపేవారు. కానీ ఈసారి  ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎంసెట్ కు ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో కనీస మార్కులతో విద్యార్థులను ప్రమోట్‌ చేశారు. దీంతో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఎంసెట్‌ అర్హత మార్కులు 40 శాతం ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 




45 రోజుల వ్యవధి ఆనవాయితీ 


 మే 6వ తేదీ నుంచి మే 24 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీల్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీల్లో సెకండియర్‌ పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు మే 24తో ముగుస్తాయి. ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్‌కు ప్రిపేర్ అయ్యేందుకు 45 రోజుల వ్యవధి ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. జులై 3వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఉన్నందున ఎంసెట్‌ను జూలై 14 నుంచి నిర్వహిస్తున్నారు.