TSRJC CET 2022: Application Last Date Extended: తెలంగాణలోని టెన్త్ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కాలేజీ (రెసిడెన్షియల్ కాలేజీ)లలో 2022-23 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న టీఎస్ఆర్ జేసీ సెట్ 2022 దరఖాస్తుల తుది గడువును పొడిగించారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 11తో తుది గడువు ముగిసిన నేపథ్యంలో.. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మే 22వ తేదీన నిర్వహించే టీఎస్ఆర్ జేసీ-సెట్ 2022-23 ప్రవేశ పరీక్ష (TSRJC CET 2022)కు 10వ తరగతి విద్యార్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీలలో ఇంటర్ ప్రవేశ పరీక్షలకు టీఎస్ఆర్ జేసీ సెట్ నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ( ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ)లో 35 తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశం కొరకు సెట్ దరఖాస్తులను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల కోరిక మేరకు దరఖాస్తు గడువును పొడిగించినట్టు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్ధ తెలిపింది. మే 22న టీఎస్ఆర్ జేసీ సెట్ 2022-23 (TSRJC CET 2022 Exam Date) నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
2021-22 సంవత్సరంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో మొత్తం రెసిడెన్షియల్ ఆంగ్ల మాద్యమం జూనియర్ కాలేజీలు 35 ఉండగా.. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో దాదాపు 3 వేల వరకు సీట్లు ఉన్నాయి. ఇందులో బాయ్స్ కాలేజీలు 15, బాలికల కాలేజీలు 20 ఉన్నాయి. పూర్తి వివరాలు టీఎస్‌ఆర్‌జేసీ సెట్ అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవాలి.
తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్..
తొలుత ప్రకటించిన పదో తరగతి పరీక్షల (Tenth Class Exams in Telangana) సమయంలోనే జేఈఈ మెయిన్ (JEE Main) ఎంట్రెన్స్ పరీక్షలు రావడంతో పదో తరగతి పరీక్షలను రీ షెడ్యూల్ చేశారు. దాని ప్రకారం.. మే 23వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 24న సెకండ్ లాంగ్వేజ్, 25వ తేదీన థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్), 26న మ్యాథమెటిక్స్, 27న ఫిజిక్స్, బయాలజీ, 28న సాంఘిక శాస్త్రం, 30న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, 31న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2, ఇక, జూన్ 1వ తేదీన ఎస్ఎస్సెసీ ఒకేషనల్ కోర్సు (థియరీ) పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహించనున్నారు. జూన్ 1వ తేదీన జరిగే ఒకేషనల్ కోర్సు (థియరీ) పరీక్ష మాత్రం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించనున్నారు.
Also Read: Telangana SSC Exams: తెలంగాణలో పది పరీక్షలు కూడా వాయిదా - కొత్త షెడ్యూల్, టైం టేబుల్ ఇదీ
Also Read: CBSE Exam Centre Change: సీబీఎస్‌ఈ బోర్డు కీలక ప్రకటన.. ఎగ్జామ్ సెంటర్ మార్పునకు ఓకే!