Telangana SSC Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షల తరహాలోనే పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. జేఈఈ మెయిన్ ఎంట్రెన్స్ 2022 తేదీలు మారడంతోనే పాత షెడ్యూల్‌ను మార్చాల్సి వచ్చింది. తొలుత ప్రకటించిన పదో తరగతి పరీక్షల (Tenth Exams in Telangana) సమయంలోనే జేఈఈ మెయిన్ (JEE Main) ఎంట్రెన్స్ పరీక్షలు రావడంతో ఇప్పుడు పదో తరగతి పరీక్షలను రీ షెడ్యూల్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. తాజాగా బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను (Telangana SSC Exams Schedule) విడుదల చేసింది. దీని ప్రకారం తెలంగాణలో మే 23వ తేదీ నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నట్టు సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ బోర్డు వెల్లడించింది. మే నెల 23 నుంచి జూన్ 1 వరకూ పరీక్షలను నిర్వహించనున్నారు.
పది పరీక్షల కొత్త టైం టేబుల్ ప్రకారం.. మే 23వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 24న సెకండ్ లాంగ్వేజ్, 25వ తేదీన థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్), 26న మ్యాథమెటిక్స్, 27న ఫిజిక్స్, బయాలజీ, 28న సాంఘిక శాస్త్రం, 30న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, 31న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2, ఇక, జూన్ 1వ తేదీన ఎస్ఎస్సెసీ ఒకేషనల్ కోర్సు (థియరీ) పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహించనున్నారు. జూన్ 1వ తేదీన జరిగే ఒకేషనల్ కోర్సు (థియరీ) పరీక్ష మాత్రం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించనున్నారు.
JEE పరీక్షల్లో మార్పు అందుకే..
ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగాల్సిన పరీక్షల తేదీలను మార్పు చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో ఈ తొలి విడత పరీక్షలను నిర్వహించనున్నారు. జేఈఈ పరీక్షల తేదీల్లోనే వివిధ రాష్ట్రాల్లో స్థానిక బోర్డు పరీక్షలు నిర్వహిస్తోంది. దీంతో విద్యార్థులు విజ్ఞప్తి మేరకు ఎన్‌టీఊ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) తదితర విద్యా సంస్థలలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ – 2022 పరీక్షను నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో ఒంటిపూట బడులు
మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు (Half Day Schools) నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు బడులు నిర్వహిస్తారు. ఎండలు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మే మూడో వారం వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.