ఎంత చిన్న ఊరిలో అయినా భోజనం కనీసం 50 రూపాయలుంటుంది. ఓ మోస్తరు పట్టణాల్లో ప్లేటు భోజనం 70 నుంచి 80 రూపాయల వరకు ఉంటుంది. ఫుల్ బోజనం కావాలంటే వంద రూపాయలు దాటాల్సిందే. అలాంటి రోజుల్లో కేవలం 20 రూపాయలకే భోజనం అందిస్తున్నాడు ఓ పెద్దాయన. పేరు బాలు. ఊరు నెల్లూరు.. నెల్లూరులో ఆటో నడుపుతుండేవాడు. ఇటీవల మొబైల్ హోటల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. అయితే అందరిలా కాకుండా కాస్త వెరైటీగా ఆలోచించాడు. పేరుకి రోడ్ సైడ్ మొబైల్ హోటల్ అయినా క్వాలిటీలో మాత్రం తీసిపోకూడదు అని నిర్ణయించుకున్నాడు. ధర కూడా రీజనబుల్ గా ఉండాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇలా హోటల్ తెరిచాడు. ఆటోలోనే దీన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
పులిహోర, పెరుగన్నం, క్యారెట్ రైస్, వెజిటబుల్ రైస్, జీరా రైస్, మిక్స్ డ్ వెజిటబుల్, మీల్ మేకర్, కరివేపాకు రైస్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ 20 రకాల భోజనం దొరుకుతుంది. ఓ కప్పులో రైస్ పెట్టి ఇచ్చేస్తారు. దీని రేటు 20 రూపాయలు. ఆ రైస్ లోకి కారం, పప్పులపొడి వేస్తారు. ఇక పార్సిల్ అయితే కడుపునిండా తినొచ్చు. పార్సిల్ రేటు 40 రూపాయలు.
హోటళ్లలో ఇలాంటి రైస్ దొరకొచ్చు కానీ రేటు బాగా ఎక్కువ. అందులోనూ ఈ క్వాలిటీ దొరకడం బాగా కష్టం అంటున్నారు కస్టమర్లు. చూడ్డానికి మొబైల్ క్యాంటీనే అయినా ఇక్కడ అదిరిపోయే క్వాలిటీ దొరుకుతుందని అంటున్నారు. అందుకే ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి భోజనం చేస్తామని చెబుతున్నారు విద్యార్థులు. చుట్టుపక్కల ఆస్పత్రులు ఇతర ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు కూడాల ఈ హోటల్ పెట్టాక ఇంటి దగ్గరనుంచి లంచ్ బాక్స్ లు తెచ్చుకోవడం మరచిపోయారు. అందరూ మధ్యాహ్నం అవగానే ఇక్కడికి వచ్చేస్తారు. ఎంచక్కా రోజుకో రకం ఫుడ్ లాగించేస్తారు.
లాభం కాదు, క్వాలిటీయే ముఖ్యం..
తనకు లాభం కంటే క్వాలిటీయే ముఖ్యం అంటున్నాడు హోటల్ నిర్వాహకుడు బాలు. బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ఇలాంటి హోటల్స్ చూసి ఇన్స్ పైర్ అయి నెల్లూరులో దీన్ని పెట్టానంటున్నాడు. కుటుంబ సభ్యులతో కలసి ఈ హోటల్ నడుపుతున్నానని చెప్పాడు. ఒకసారి వచ్చి తినివెళ్లినవారంతా తమకు పర్మినెంట్ కస్టమర్లు అవుతారని నమ్మకంగా చెబుతున్నాడు.
వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ కి నెల్లూరు పెట్టింది పేరు. నెల్లూరులో టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇదిగో ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఈ బాలు ఫుడ్స్ కూడా చేరింది. ఇప్పుడు నెల్లూరులో పేరున్న హోటల్స్ గురించి చెప్పమంటే బాలు ఫుడ్స్ గురించి కూడా చెప్పేస్తున్నారు. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లో బైపాస్ రోడ్ కి దగ్గర్లో ఈ బాలు ఫుడ్స్ మొబైల్ క్యాంటీన్ ఉంటుంది. పండగలు, సెలవలు ఏవీ ఉండవు.. అన్ని రోజుల్లో హోటల్ అందుబాటులో ఉంటుంది. ఓసారి మీరూ ట్రైచేసి చూడండి.