నెల్లూరు జిల్లాలో నిమ్మ రైతులు నిన్న మొన్నటి వరకూ దిగాలు పడ్డారు. ఇటీవల వరకు ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న మంచు, చలి వాతావరణం ప్రభావంతో నిమ్మకాయల ధరలు పడిపోయాయి. డిమాండ్ తగ్గడంతో ఎగుమతులు తగ్గిపోయాయి. కానీ ఒక్కసారిగా వాతావరణం మారింది. ఎండలు మండిపోతున్నాయి, మరోవైపు పండగల సీజన్ కూడా రాబోతుండటంతో.. నిమ్మ రైతులకు కాలం కలిసొచ్చింది. డిమాండ్ క్రమక్రమంగా పెరుగుతుండటంతో నిమ్మ రైతులకు లాభాలు కనపడుతున్నాయి. 


తాజాగా పొదలకూరు మార్కెట్లో నిమ్మకాయల ధరలు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. లూజు బస్తా ధర రూ.5 వేలు నుంచి రూ.6 వేల వరకు చేరింది. అంటే ఒక కాయ ధర రూ.3 పలికింది. హోల్ సేల్ మార్కెట్ లోనే ఈ రేటు ఉండటంతో.. బహిరంగ మార్కెట్ లో కూడా నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నెల్లూరు జిల్లా పొదలకూరులోని మార్కెట్‌ నుంచి రోజూ 10 లారీల సరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళుతోంది. ఢిల్లీ, కోల్‌ కత, బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, కేరళ కు లారీలు బయలుదేరి వెళ్తుంటాయి. 




ప్రస్తుతం ఎండలు పెరగడంతో నిమ్మకాయలకు గిరాకీ పెరిగింది. ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉందని రైతులు చెట్లకు ఉన్న నిమ్మకాయలను జాగ్రత్తగా కోసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఉగాది, రంజాన్‌ పండుగల నేపథ్యంలో వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది. నెలరోజులుగా ఢిల్లీ, కోల్‌ కత, బీహార్‌, చెన్నై, బెంగళూరు మార్కెట్లలో వీటికి గిరాకీ పెరిగింది. రెండేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఇది కొంత ఊరటనిస్తోంది. వారం నుంచి నిమ్మ ధరల్లో మార్పు వచ్చింది. ప్రస్తుతం పొదలకూరు, గూడూరు మార్కెట్ల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల కారణంగా మార్కెట్‌ కొంత ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి పెరిగిన ధరలు కొనసాగే అవకాశముంది. 


నెల్లూరు జిల్లాలోని గూడూరు, పొదలకూరు, రాపూరు, సైదాపురం, ఓజిలి, డక్కిలి, బాలాయపల్లి, చేజర్ల తదితర ప్రాంతాల్లో సుమారు 17 వేల హెక్టార్లలో నిమ్మ పంట సాగవుతోంది. వర్షాలు సక్రమంగా పడితే అరకొరగా నీరున్నా నిమ్మ చెట్లకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. గతేడాది భారీ వర్షాలకు జలవనరులు నిండుగా ఉన్నాయి. పంట కాల్వల్లో కూడా సమృద్ధిగా నీరుంది. దీంతో నిమ్మకాయల దిగుబడి పెరిగింది. అనుకోకుండా డిమాండ్ పెరగడంతో రేటు పెరిగింది. 


డిమాండ్ పెరిగితే తెలంగాణ నుంచి కూడా.. 
గతంలో గూడూరులో నిమ్మకాయల ధరలు పెరిగితే.. ఇక్కడ మార్కెట్ ని ఒడిసి పట్టుకునేందుకు తెలంగాణ రైతులు కూడా తమ సరుకుని అమ్మకానికి తెస్తుంటారు. ముఖ్యంగా నల్గొండ, నకిరేకల్ నుంచి కూడా గూడూరుకి నిమ్మకాయలు తెస్తుంటారు. ఇక్కడినుంచి ఎగుమతులు ఎక్కువగా ఉండటంలో రైతులు గూడూరు కేంద్రంగా వ్యాపారం చేస్తుంటారు. తెలంగాణ నుంచి సరుకు వస్తుందంటే కచ్చితంగా రేట్లు తగ్గిపోతాయనే అంచనాలుంటాయి. డిమాండ్ కంటే ఎక్కువగా మార్కెట్ కి సరకు వచ్చేస్తే కచ్చితంగా రేటు పడిపోతుంది. ప్రస్తుతం అన్నీ అనుకూలించి రేట్లు పెరగడంతో నెల్లూరు జిల్లా రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. రేటు మరింత పెరిగితే బాగుంటుందని ఆశిస్తోంది.