ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తామంటూ రష్యా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అసలు ఏంటీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే భూమి నుంచి సుమారు 408 కిలోమీటర్ల ఎత్తులో అంటే ఆకాశంలో ఇంటర్ నేషనల్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. అదొక కొలాబరేటివ్ ఫెసిలిటీ. అమెరికా, రష్యా సహా మొత్తం 15 దేశాలు కలిసి ఈ ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ ను మెయిన్ టైన్ చేస్తున్నాయి.


అసలెందుకు ఈ స్పేస్ రీసెర్చ్ స్టేషన్ అంటే...భూమి పై నుంచి అనేక దేశాలు అంతరిక్ష ప్రయోగాలను చేస్తున్నాయి. చంద్రుడి మీదకు, మార్స్ మీదకు భవిష్యత్తులో వెళ్లి అక్కడ స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకోవాలనేది చాలా స్పేస్ ఏజెన్సీలకు ఎప్పటి నుంచో ఉన్న ప్లాన్. అందులో భాగంగా ప్రతీసారి భూమి పై నుంచి వెళ్లే కంటే....భూమి వాతావరణాన్ని దాటాక ఓ హాల్ట్ పాయింట్ లాంటిది ఉంటే అక్కడి నుంచి ప్రయాణాలు సాగించటం సులువు అవుతుందని చాలా దేశాలు భావించాయి. అంతే కాదు భూమిపై జరుగుతున్న మార్పులను గమనించేందుకు....ఇంకా శాస్త్రవిజ్ఞానికి సంబంధించి అనేకానేక ప్రయోగాలు చేసేందుకు ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఓ వేదిక. గతంలో అమెరికా, రష్యా లాంటి దేశాలు తమ కోసం విడివిడిగా స్పేస్ స్టేషన్ల లాంటి ప్రయోగాలు చేశాయి. రష్యా స్పేస్ స్టేషన్లు శాల్యూట్, ఆల్మాజ్, మిర్ లాంటివి అవే. అమెరికా కూడా స్క్రైలాబ్ లాంటి ప్రయోగాలు చేసింది. ఆ తర్వాత అన్ని దేశాలు కలిసి ఓ ఒప్పందానికి రావాలాని నిర్ణయించుకుని ఇప్పుడున్న తొమ్మిదవ స్పేస్ స్టేషన్ ను అసెంబుల్ చేశాయి. దానికే ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ అని పేరు పెట్టాయి. అలా 1998 నవంబర్ 20న అంటే 23 ఏళ్ల ముందు ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ సిద్దమైంది.



ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ లో ప్రధానంగా రెండు భాగాలుంటాయి. ఒకటి రష్యన్ ఆర్బిటల్ సెగ్మెంట్...మరొకటి యునైటెడ్ ఆర్బిటల్ సెగ్మెంట్ . రష్యన్ సెగ్మెంట్ లో మొత్తం ఆరు మాడ్యూల్స్ ఉంటాయి. యూఎస్ సెగ్మెంట్ లో పది మాడ్యూల్స్ ఉంటాయి. యూఎస్ సెగ్మెంట్ లో నాసా కి 76 శాతం సపోర్ట్ సర్వీసెస్ వాటా ఉంటే....జపాన్ స్పేస్ ఏజెన్సీ జాక్సా కీ 12.8 శాతం, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి 8.3 శాతం, కెనడియన్ స్పెస్ ఏజెన్సీ కి 2.3 శాతం వాటా ఉంది.


మరి ఇక్కడే ఉండి ప్రయోగాలు చేసే ఆస్ట్రోనాట్లు నివసించేందుకు ఐఎస్ఎస్ లో మొత్తం 16 హ్యాబిటబుల్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇదుగో ఇలా ఉంటాయవి.  వీటిలో అమెరికావి 8 అయితే...రష్యా వి 6. ఒకటి జపాన్ ది ఇంకోటి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీది. ప్రస్తుతం ఏడుగురు వ్యోమగాములు ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్నారు. సెకనుకు ఐదు మైళ్ల వేగంతో..ప్రతీ తొంభై నిమిషాలకు ఓ సారి భూమిని చుట్టేస్తోంది ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్. ఇరవై నాలుగు గంటల సమయంలో భూమి పై ఓ రోజు లో....ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. సో కేవలం ఒక్కరోజు పదహారు సూర్యోదయాలను, పదహారు సూర్యస్తమయాలను చూసే అవకాశం ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ లోని వాళ్లు ఎక్స్ పీరియన్స్ చేస్తారు.


ఇప్పుడు బయటకు వచ్చేస్తామని ప్రకటించిన రష్యా..గతంలో ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభం సమయంలో తమ దేశ భూభాగంపైన ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ తిరుగుతున్నప్పుడు కూల్చేస్తామంటూ బెదిరింపులకు కూడా దిగింది. కానీ అది సాధ్యం కాదనే విషయం రష్యాకు కూడా తెలియటం...ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రావటంతో ఇప్పుడు సొంతంగా స్పేస్ స్టేషన్ ను నిర్మించుకుంటామని 2024 లో ప్రస్తుత అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చేస్తామని రష్యా ప్రకటించింది.