TGRDC CET- 2024 Application: తెలంగాణలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు ఏప్రిల్ 12 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశపరీక్ష (TG RDC CET-2024) ద్వారా ఎంపికైన విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ బాలుర/బాలికల సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 21 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
వివరాలు..
* టీజీ ఆర్డీసీ సెట్(TGRDC CET)-2024
కోర్సులు: బీఎస్సీ, బీకాం, బీఏ(సీబీసీఎస్), బీబీఏ, బీఎస్సీ- ఫ్యాషన్ టెక్నాలజీ, బీఎస్సీ (ఆనర్స్) డిజైన్, టెక్నాలజీ, బీఎస్సీ లైఫ్‌సైన్సెస్, బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్)తో పాటు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు..
➥ ప్రవేశాలు కోరువారు 2023-24 విద్యాసంవత్సరంలో 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్‌లో 40శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 శాతం సడలింపు ఉంది.
➥ విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు; పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.
➥ తహసీల్దార్ లేదా ఎమ్మార్వో తాజాగా జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉండాలి. కౌన్సెలింగ్ సమయంలో చూపించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.200.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశపరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు OMR విధానంలో ప్రవేశ పరీక్ష(ఆర్డీసీ సెట్-2024) నిర్వహిస్తారు. పరీక్షకు రెండున్నర గంటల సమయం కేటాయించారు. ఇంటర్ సిలబస్ ఆధారంగానే పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఆబ్జెక్టివ్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.04.2024.
➥ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు: 21.04.2024 నుంచి.
➥ ఆర్డీసీసెట్-2024 పరీక్షతేది: 28.04.2024.
ALSO READ:
TSRJC CET - 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని 35 సాధారణ గురుకులాల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న TSRJC CET 2024 దరఖాస్తు గడువును మార్చి 31 వరకు పొడిగించారు. వాస్తవానికి మార్చి 16తో గడువు ముగియనుంది. అయితే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు మరో రెండు వారాలపాటు పొడిగించినట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి రమణకుమార్ మార్చి 15న ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు గడువును పెంచడంతో మరింత మందికి దరఖాస్తుకు అవకాశం లభించినట్లయింది. గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్–2024 (TSRJC CET-2024) నోటిఫికేషన్‌ను జనవరి 25న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జనవరి 31 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 20 గురుకుల జూనియర్ కాలేజీలు ఉన్నాయి.
దరఖాస్తు, ప్రవేశ పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..