Police Siezed Around 6 Crores in Karimnagar Hotel: కరీంనగర్ లో (Karimnagar) పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా రూ.కోట్లలో నగదు స్వాధీనం చేసుకున్నారు.  హోటల్, బార్ అండ్ రెస్టారెంట్, సినిమా హాళ్లలో సోదాలు చేసిన పోలీసులు రూ.6.65 కోట్లు సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకపోవడంతో ఈ నగదు సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి 1:30 గంటల నుంచి శనివారం ఉదయం వరకూ సోదాలు కొనసాగాయి. స్వాధీనం చేసుకున్న నగదును కోర్టులో డిపాజిట్ చేయనున్నట్లు ఏసీపీ నరేందర్ చెప్పారు. ఈ నగదు ఎవరిది అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అయితే, పోలీసులు తనిఖీలకు వెళ్లే సరికి కొంత నగదును తరలించినట్లు తెలుస్తోంది. కాగా, నగదు లభించిన హోటల్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కు సంబంధించినదని సమాచారం. ఓవైపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఇంత భారీ మొత్తంలో నగదు సీజ్ కావడం సంచలనంగా మారింది. 


Also Read: Kavitha: రౌస్ ఎవెన్యూ కోర్టు ముందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత - అక్రమ అరెస్ట్, తనను కావాలనే కేసులో ఇరికించారని వెల్లడి