Kavitha Medical Tests Are Completed: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (Mlc Kavitha) ఈడీ శుక్రవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ఉన్న ఆమెకు శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల బృందం ఈడీ కార్యాలయానికి చేరుకుని కవితకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం అక్కడి నుంచి వైద్యుల బృందం వెళ్లిపోయింది. తర్వాత కవితను ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టుకు తరలించారు. జస్టిస్ కేఎం నాగపాల్ ముందు ఆమెను హాజరుపరిచారు. కవితను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ద్వారా బినామీ పేర్లతో అక్రమార్జన చేశారని ఆమెపై అభియోగాలు. అయితే, ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించి అరెస్ట్ చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అటు, ఈడీ కార్యాలయం, రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రాంగణంలో కేంద్ర బలగాలు, పోలీసులు భారీగా మోహరించారు. ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు సైతం భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఆందోళనకర వాతావరణం నెలకొంది. కాగా, శనివారం మధ్యాహ్నం కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. కవిత భర్త, ఆమె తరఫు లాయర్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. 


















కాగా, శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. భారీ భద్రత నడుమ రాత్రి ఆమెను ఢిల్లీ ఈడీ కార్యాలయానికి తరలించారు. మనీ లాండరింగ్ కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.


Also Read: Telangana Election Schedule: సార్వత్రిక సమరానికి సిద్ధం - తెలంగాణలో మారిన రాజకీయ చిత్రం, ప్రజల తీర్పు ఎటువైపో?