Eggs: గుడ్డు పోషకాహారం మాత్రమే కాదు, అందరికీ నచ్చే రుచితో.. అందరూ మెచ్చే ఆహారం. సలాడ్, శాండ్ విచ్ నుంచి, ఉడికించి లేదా ఆమ్లేట్, కూర ఇలా ఎన్నో రూపాల్లో వండుకుని తినవచ్చు కూడా. అయితే కోడి గుడ్లను చాలా జాగ్రత్తగా నిలువ చేసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా ఫ్రిజ్ లోనే ఉంచాలి. ప్రతి సారీ ఒక గుడ్డు మొత్తం వండాల్సి ఉంటుంది. గుడ్లు జాగ్రత్తగా నిల్వ చెయ్యకపోతే వాటిలో బ్యాక్టీరియా పెరగవచ్చు. అనారోగ్యానికి కారణం కావచ్చు.
కోనేప్పుడు జాగ్రత్త
గుడ్లు కొనే సమయంలో అవి సరిగ్గా నిల్వ చేశారా లేదా అనేది చూసుకోవాలి. రూమ్ టెంపరేచర్‌లో గుడ్లు త్వరగా పాడైపోతాయి. చల్లని వాతావరణంలో అంత త్వరగా చెడిపోవు. కనుక కచ్చితంగా రిఫ్రిజిరేటర్లో ఉన్న కోడి గుడ్లను మాత్రమే కొనుక్కోవాలి. ఏసీ సదుపాయం ఉన్న స్టోర్స్‌లో కొనుగోలుచేసినా పర్వాలేదు.
పగుళ్లు ఉండకూడదు
గుడ్డు పై పెంకు చిన్నగా నెర్రలు వేసినా సరే అటువంటి గుడ్లు కొనకూడదు. షాప్ నుంచి ఇంటికి తెచ్చే లోపు ఒకటి అరా గుడ్లు ఒక్కోసారి పగులుతుంటాయి. వీటిని వెంటనే వాడడం మంచిది.
సరైన టెంపరేచర్
ఫ్రిజ్ లో పెట్టినంత మాత్రాన గుడ్లు చెడిపోకుండా ఉంటాయని అనుకుంటే పొరపాటే ఫ్రిజ్ లో టెంపరేచర్ 40 లేదా అంతకంటే తక్కువ ఫారెన్ హీట్ డిగ్రీలలో ఉంచాలి. కోడిగుడ్లను వాటి కార్టన్లలోనే నిల్వ చేయడం మంచిది. మామూలుగా ఎగ్ ట్రే ఫ్రిజ్ లోని డోర్ భాగంలో ఉంటుంది. కానీ ఈ భాగం ఫ్రిజ్ లో తక్కువ చల్లదనం ఉండే భాగం. గుడ్లను చల్లగా ఉండే చోట మాత్రమే నిలువ చెయ్యాలి.
వండిన గుడ్లు కూడా
గుడ్లతో తయారు చేసిన పదార్థాలను కూడా జాగ్రత్తగా రిఫ్రిజిరేట్ చేసి నిల్వ చేసుకోవాలి. బయట వదిలేసిన పదార్ధాలు త్వరగా చెడిపోతాయి. గుడ్డుతో వండిన ఏ పదార్థమైనా సరే వండిన రెండు గంటల్లో ఫ్రిజ్ లో భద్రపరుచుకోవాలి.
వండే సమయంలో జాగ్రత్త
కొన్ని రకాల వంటల్లో గుడ్డు వాడుతారు. గుడ్డు కలిపిన తర్వాత రెండు గంటలలోపే వండేసుకోవాలి. రెండు గంటలకు మించి బయట వదిలేసి ఉంచితే అందులో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది.
ఫ్రీజ్ చెయ్యకూడదు
చాలా రకాల ఆహారాలు ఫ్రీజ్ చేసి ఉపయోగించుకోవడం ఈ మధ్య చాలా సాధారణం అయిపోయింది. కానీ గుడ్డును మాత్రం ఇలా ఫ్రీజ్ చెయ్యకూడదు. ఫ్రీజ్ చేసిన గుడ్డు తిరిగి ఉపయోగించుకోవడానికి ఏమాత్రం సురక్షితం కాదు. గుడ్డును ఫ్రీజ్ చేస్తే అందులో ఉండే నీరు వ్యాకోచించి గుడ్డ్ పై పెంకు పగిలిపోయే ప్రమాదం ఉంది.
Also Read : పెయిన్ కిలర్స్ వాడితే మగతనం మటాష్? పిల్లలు పుట్టడమూ కష్టమేనా, తాజా అధ్యయనంలో ఏం తేలింది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.