UGC NET December - 2023 Schedule: దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (Assistant professor), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (JRF) కోసం నిర్వహించనున్న 'యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2023 (UGC NET) పరీక్ష షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నవంబరు 17న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రధాన నగరాల్లోని కేంద్రాల్లో డిసెంబర్ 6 నుంచి 14 వరకు యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన ఫలితాలను 2024, జనవరి 10న వెల్లడించనున్నారు. పరీక్షకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే అభ్యర్థులు 011-40759000 ఫోన్ నెంబరు లేదా ఈమెయిల్: ugcnet@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.
పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను పరీక్షకు 10 రోజుల ముందు నుంచి అందుబాటులో ఉంచనున్నారు. మొత్తం 83 సబ్జెక్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టులో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టులో పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షకు హాజరయ్యే మొత్తం అభ్యర్థుల్లో ఆరు శాతం మందినే నెట్ ఉత్తీర్ణులుగా (అసిస్టెంట్ ప్రొఫెసర్) ప్రకటిస్తారు. అదేవిధంగా జేఆర్‌ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీ అభ్యర్థుల ఎంపికలోనూ కనీస అర్హత మార్కుల ఆధారంగా ఉత్తీర్ణులను ప్రకటించనున్నారు. ఇందుకోసం పలు స్లాట్లలో నిర్వహించనున్న పరీక్షను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా నార్మలైజేషన్ ప్రక్రియ చేపడతారు.
యూజీసీ నెట్ పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం..
➥ ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.
➥ పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
➥ పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్‌నగర్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్.
ఏపీలో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు-చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గూడురు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తూర్పుగోదావి-సూరంపాలెం, పశ్చిమగోదావరి-తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
నెట్‌తో ప్రయోజనాలెన్నో..
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాతో అధ్యాపక వృత్తిలో అడుగు పెట్టొచ్చు. యూజీసీ నిబంధనల ప్రకారం-నెట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో ఉత్తీర్ణత సాధించిన వారినే ఈ పోస్ట్‌లకు ఎంపిక చేయాలి. ఏడో పీఆర్‌సీ సిఫార్సుల ప్రకారం-అసిస్టెంట్ ప్రొఫెసర్ పే స్కేల్‌ను ప్రారంభంలోనే నెలకు రూ.67 వేలు బేసిక్ పే చెల్లించాలని ∙యూజీసీ నిర్దేశించింది.
➥ జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే.. ప్రముఖ రీసెర్చ్ లేబొరేటరీల్లో రెండేళ్లపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోగా, ఆ తర్వాత మరో రెండేళ్లు సీనియర్ రీసెర్చ్ ఫెలోగా అవకాశం లభిస్తుంది.
➥ జేఆర్‌ఎఫ్ హోదాలో మొదటి రెండేళ్లు నెలకు రూ.31 వేల ఫెలోషిప్ అందుతుంది.
➥ జేఆర్‌ఎఫ్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత లభిస్తుంది. ఈ దశలో రెండేళ్లపాటు నెలకు రూ.35 వేల స్కాలర్‌షిప్ అందుతుంది.
➥ జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు పూర్తి చేసుకున్నవారు సైంటిస్ట్‌లుగా కెరీర్ ప్రారంభించొచ్చు.
➥ ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో పీహెచ్‌డీ, రీసెర్చ్ అభ్యర్థుల ఎంపికలో నెట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది.
➥ ఆర్ట్స్,హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్‌లలో జేఆర్‌ఎఫ్‌కు ఎంపికై పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పురావస్తు శాఖ, ఆర్థిక గణాంక శాఖలు, సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ వంటి పలు ప్రభుత్వ శాఖల్లో రీసెర్చ్ స్కాలర్స్‌గా అవకాశాలు లభిస్తాయి.