Minister KTR In Khanapur Campaign: కేసీఆర్ (KCR) ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ (Telangana) దశ, దిశ మారిందని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Minister KTR)  అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఏర్పాటు చేసిన  ప్రజా ఆశీర్వాద సభ (Praja Ashirvada Sabha)లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణను నాశనం చేసేందుకు ఢిల్లీ లీడర్లు బీజేపీ తరఫున మోదీ, అమిత్ షా, యోగి, కాంగ్రెస్ తరఫున  ప్రియాంక, రాహుల్ గాంధీ వస్తున్నారని  అన్నారు. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. 


ఖానాపూర్‌ను దత్తత తీసుకుంటా
జాన్సన్‌ను ఓడించడానికి దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కవ్వాల్ టైగర్ జోన్ గ్రామాలు, డిగ్రీ కళాశాల ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయని అన్నారు. జాన్సన్‌ను గెలిపిస్తే  గెలిపిస్తే ఖానాపూర్‌ను దత్తత తీసుకుంటానని, సిరిసిల్లకు దీటుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. కడెం ప్రాజెక్ట్‌కు మరో 12 గేట్లను పెట్టి రైతులకు నీరు అందిస్తామన్నారు. కుప్టి ప్రాజెక్ట్ రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 


ఎవరి పడితే వారి చేతుల్లో తెలంగాణ పెడదామా?
మంచిగా నడిచే ప్రభుత్వాన్ని.. ప్రగతిలో దూసుకెళ్తోన్న రాష్ట్రాన్ని ఎవరు పడితే వారి చేతుల్లో పెడదామా? అని కేటీఆర్ ప్రశ్నించారు. గత 50 ఏళ్లలో తెలంగాణను కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందన్నారు. ప్రజలు ఆలోచించాలని  కోరారు. ఒకవైపు కాంగ్రెస్‌, మరోవైపు నుంచి బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వస్తున్నారని.. వారందరి అజెండా ఒక్కటేనన్నారు. ఎలాగైనా కేసీఆర్‌ గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. 


ఖానాపూర్ సభలో.. 
ఖానాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో (Telangana Elections) మాట్లాడిన కేటీఆర్‌.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.రాష్ట్రాన్ని పదేళ్లలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన బీఆర్ఎస్‌కు ప్రజలు అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ నేతలను నమ్ముకున్నాయని, తాము మాత్రం తెలంగాణ ప్రజలనే నమ్ముకుని ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో 46 లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు వస్తున్నాయని, కాంగ్రెస్‌ (Congress) హయాంలో కేవలం 29 లక్షల మందికి మాత్రమే పింఛన్లు వచ్చేవని గుర్తు చేశారు. 


బీడీ కార్మికులకు అండగా నిలిచారు
బీడీ కార్మికులుగా పని చేసే అక్కా చెల్లెళ్లను గతంలో ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదని, కేసీఆర్‌ సీఎం అయ్యాకే రూ.2వేలు పింఛన్‌ ఇస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ పెత్తందార్లతో పోరాడి తెలంగాణ సాధించుకున్నామని అందుకే, మన డబ్బు మనకే ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు. రైతు బీమా, రైతు బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు కేసీఆర్ అండగా ఉన్నారని అన్నారు. 


అత్తలకు ఫించన్లు
మరో సారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మాకేం చేస్తారని తెలంగాణ ఆడబిడ్డలు అడుగుతున్నారని వారందరికి త్వరలో శుభవార్త చెబుతామన్నారు. అత్తలకు పింఛన్లు ఇస్తామని, కోడళ్లకు డిసెంబర్‌ 3 తర్వాత కేసీఆర్‌ శుభవార్త చెబుతారని కేటీఆర్ అన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరి కోసం ‘సౌభాగ్య లక్ష్మి’ పథకం అమలు చేస్తామని, నెలకు రూ.3 వేలు మీ ఖాతాల్లో వేస్తామన్నారు. ఖానాపూర్‌లో మీరు వేసే ఓటు జాన్సన్‌కు కాదని, కేసీఆర్‌కు వేస్తున్నట్లే భావించాలని కేటీఆర్‌ కోరారు.


అభివృద్ధి బాటలో తెలంగాణ
కాంగ్రెస్‌ హయాంలో సర్కారు దవాఖానాకు వెళ్లేందుకు ప్రజలు భయపడి పోయేవారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిపోయిందన్నారు. తాగు నీరు, సాగు నీరు, కరెంటు, సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ తెలంగాణ అభివృద్ధి బాటలో ముందుకెళ్తోందని చెప్పారు. నీరు, కరెంటుతో పాటు అనేక సమస్యలను సీఎం కేసీఆర్ 9 ఏళ్లలో పరిష్కరించారని అన్నారు. 


అంతా బోగస్
ఖానాపూర్‌ను సొంత నియోజకవర్గంలా చూసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. బోగస్ సర్వేలు, ముచ్చట్లు నమ్మొద్దని, మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు.  ఎవరెన్ని మాటల మాట్లాడినా.. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అన్నారు. మిగతా పార్టీల వాళ్లు చెప్పేవి బోగస్ ముచ్చట్లని కొట్టి పారేశారు.