NEET UG 2024: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 9 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 5న నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నారు. నీట్ యూజీ-2024 నోటిఫికేషన్ వెలువడిన తర్వార అధికారిక వెబ్‌సైట్‌లో నీట్ పరీక్ష తేదీలతోపాటు పరీక్ష సిలబస్, అప్లికేషన్ ఫామ్, ఇన్‌ఫర్మేషన్ బులిటన్, పరీక్ష పూర్తి స్వరూపం గురించి అందుబాటులో ఉంచనున్నారు. దాదాపు రెండునెలలపాటు నీట్ యూజీ దరఖాస్తు ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. నీట్ పరీక్షకు సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం..


ఎవరు అర్హులు..?


➥ నీట్ పరీక్షకు హాజరుకావాలనుకునే విద్యార్థుల వయసు 17 నుంచి 31 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


➥ అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీతో పాటు ఇంగ్లిష్‌ను తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉత్తీర్ణులై ఉండాలి.


➥ అభ్యర్థులకు ఇంటర్‌లో కనీసం 50% మార్కులు (జనరల్, ఈడబ్ల్యూఎస్), 45% మార్కులు (జనరల్ పీహెచ్) & 40% మార్కులు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) సాధించాలి.


➥ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి రౌండ్ కౌన్సెలింగ్ సమయంలో వారు తప్పనిసరిగా శాత ప్రమాణాలకు అనుగుణంగా ఉత్తీర్ణత సర్టిఫికేట్‌లను చూపించాలి.


నీట్ పరీక్ష విధానం ఇలా..
మొత్తం 720 మార్కులను నీట్ యూజీ పరీక్ష ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో అభ్యర్థులు 180 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. తప్పు సమాధానాలకు 1 మార్కు కోత ఉంటుంది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ పై ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్ట్‌ను రెండు విభాగాలుగా చేసి ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్-ఎ విభాగంలో 35 ప్రశ్నలు అడుగుతారు. అందులో అన్నింటికీ ఆన్సర్స్ రాయాలి. మొత్తం  140 మార్కులకు ఉంటుంది. రెండో విభాగం సెక్షన్-బి లో 15 ప్రశ్నలు అడుగుతారు. వాటిలో 10 ప్రశ్నలకు జవాబులు రాస్తే చాలు. మిగతా 5 ప్రశ్నలను ఛాయిస్‌లో వదిలేయవచ్చు. 


పరీక్ష వ్యవధి.. 
నీట్‌ పరీక్ష 13 భాషల్లో పెన్ అండ్ పేపర్ మోడ్‌లో, ఆఫ్ లైన్ లో నిర్వహిస్తారు. నీట్ పరీక్ష వ్యవధి మూడు గంటల 20 నిమిషాలు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.


రిజిస్ట్రేషన్ తేదీలు..
నీట్(యూజీ)-2023 పరీక్షను 13 భాషల్లో ఇండియాలోని 543 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో నిర్వహిస్తారు. డిసెంబరు చివరివారంలో నీట్ నోటిఫికేషన్ వెలువడనుంది. పరీక్ష తేదీలను కూడా వెల్లడించనున్నారు. నీట్ షెడ్యూలు ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యాక అభ్యర్థులు తమ దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. మే నెలలో నీట్-యూజీ 2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.


దరఖాస్తు సమయంలో అవసరమయ్యే డాక్యుమెంట్లు..


➥ పాస్‌పోర్ట్, పోస్ట్ కార్డు సైజు ఫోటో.


➥ వేలిముద్ర (లెఫ్ట్ హ్యాండ్)


➥ సంతకం


➥ క్యాస్ట్ సర్టిఫికేట్


➥ టెన్త్ మార్కుల మెమో


➥ సిటిజన్‌షిప్ సర్టిఫికేట్


కటాఫ్ మార్కులు...
NEET 2022 పరీక్షలో కట్ ఆఫ్ మార్కులతో అర్హత సాధించిన అభ్యర్థులు అడ్మిషన్‌కి అర్హులు. దీని తర్వాత విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలిచి ఉత్తీర్ణులైన విద్యార్థులను 15% ఆల్ ఇండియా కోటా (AIQ), 85% రాష్ట్ర కోటా సీట్ల ఆధారంగా ప్రభుత్వ కళాశాలల్లో చేర్చుకుంటారు. కటాఫ్ మార్కుల విషయానికొస్తే.. ప్రతి సంవత్సరం కటాఫ్ మార్కులు పెరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ సాధారణ అభ్యర్థులు మొత్తం 720 మార్కులకు కనీసం 550-600 మార్కులు సాధించి టాప్ ర్యాంక్‌తో ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, మంచి వైద్య కళాశాలలో ప్రవేశానికి OBC విద్యార్థులు 500-600 మార్కులు సాధించాలి, SC/ST కేటగిరీ విద్యార్థులు 450 కంటే ఎక్కువ మార్కులు సాధించాలి. గతేడాది నీట్ కటాఫ్‌ను జనరల్ కేటిగిరీకి 720 - 137 వరకు, ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ కేటగిరికీ 136 - 107 గా నిర్ణయించారు. 


నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ..
నీట్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారి స్కోర్‌కార్డ్‌ పొందిన తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం వారు రిజిస్టర్ చేసుకోవాలి. NTA మూడు రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా ఈ మూడు రౌండ్ల కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయిస్తారు. నీట్‌లోని అన్ని ప్రభుత్వ సీట్లను భర్తీ చేసే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..