NEET UG Results 2024: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్‌ యూజీ 2024 (NEET-UG 2024) పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. దీనిపై జూన్ 18న విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన అంశం కాబట్టి దాన్ని పరిశీలించడం చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.  'నీట్' నిర్వాహణలో 0.001% నిర్లక్ష్యం ఉన్నా చర్యలు తీసుకోవాల్సిందేననంటూ కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సకాలంలో తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. ఈ పొరపాటు వల్ల ఎవరైనా డాక్టర్‌గా మారితే అది సమాజానికి చాలా హానికరమని కోర్టు పేర్కొంది. పిటిషన్‌పై జులై 8లోగా సమాధానమివ్వాలని ఆదేశిస్తూ.. ఎన్టీఏకీ సుప్రీంకోర్టు మంగళవారం (జూన్ 18) నోటీసులు జారీ చేసింది.


పిటిషన్‌లో ఏముంది?
నీట్ అవకతవకలకు సంబంధించి ఎన్టీఏ ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై వివరాలను వెల్లడించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది దినేష్ జోత్వాని మాట్లాడుతూ.. నేటి (జూన్ 18) విచారణ విద్యార్థికి ఎంతో మేలు చేసిందన్నారు. దేశ ఆరోగ్య వ్యవస్థతో మీరు ఆడుకుంటున్నారని ఎన్టీఏను కోర్టు మందలించిందని ఆయన తెలిపారు. 


గత విచారణలో ఏం జరిగింది?
ఎంబీబీఎస్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షకు హాజరైన 1,563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కులను రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. జూన్ 23న పరీక్ష నిర్వహించి జూన్ 30లోగా ఫలితాలను ప్రకటిస్తామని సుప్రీంకోర్టులో కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.


గ్రేస్ మార్కులతోనే అనుమానాలు..
ఈ ఏడాది దేశవ్యాప్తంగా 557 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో 4,750 కేంద్రాల్లో నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్షను మే 5న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి పరీక్షకు రికార్డు స్థాయిలో మొత్తం 23.30 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోయిన కారణంగా.. పరీక్ష రాసినవారిలో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు కేటాయించారు. గ్రేస్ మార్కుల కేటాయింపుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది.


మరోవైపు నీట్ ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఏకంగా 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. అందులోనూ హర్యానాలో ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఒకేసారి ఒకే కేంద్రం నుంచి ఇంత మంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విద్యార్థులకు ర్యాండమ్‌గా 70 నుంచి 80 మార్కులు కలిపారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పాండే పిటిషన్‌తో పాటు మరో రెండు పిటిషన్లపై జూన్ 13న విచారణ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. 





మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..