Kumari Aunty In Bigg Boss 8: బిగ్ బాస్ రియాలిటీ షోలోకి సెలబ్రిటీలు రావడంకంటే అందులోకి వచ్చినవారే సెలబ్రిటీలు అయ్యి బయటికి వెళ్తారని చాలామంది ఈ షో గురించి విమర్శిస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని చాలామంది నెటిజన్లు ఒప్పుకుంటారు కూడా. ఇక త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 8 గురించి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. అసలు ఈసారి బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్స్‌గా ఎవరు వస్తారు అనే విషయంపై చర్చలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా కుమారి ఆంటీ పేరు లీకైంది.


ఒక్క వీడియోతో ఫేమస్..


దాసరి కుమారి అలియాస్ కుమారి ఆంటీ గురించి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చాలామందికి తెలుసు. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌తో జీవనం కొనసాగించే ఈ మహిళ.. ఒక్క వైరల్ వీడియోతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. దీంతో అటు సోషల్ మీడియాలోనే కాకుండా ఇటు రియల్ లైఫ్‌లో కూడా తనకు ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. తన బిజినెస్‌కు కూడా మంచి లాభాలు వచ్చాయి. అలా ఒక్క వీడియోతో ఫేమస్ అయిపోయిన కుమారి ఆంటీని బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజంగానే తను బిగ్ బాస్‌కు వస్తే తన గురించి ఇంకా చాలామందికి తెలుస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు.


గంగవ్వలాగానే..


మామూలుగా బిగ్ బాస్ ప్రతీ సీజన్‌లో సోషల్ మీడియా స్టార్లు, వైరల్ వీడియోతో ఫేమస్ అయిన వ్యక్తులను కంటెస్టెంట్స్‌గా తీసుకురావడం సహజం. ఆ కేటగిరిలో ఈసారి బిగ్ బాస్ హౌజ్‌లోకి కుమారి ఆంటీ రానుందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విధంగా యూట్యూబ్‌లో వీడియోల ద్వారా గంగవ్వను కూడా బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా తీసుకొచ్చారు. కానీ అంతమంది యూత్ మధ్య ఉండడం గంగవ్వకు కష్టంగా మారింది. పైగా తన వయసు సహకరించక తను టాస్కులు కూడా ఆడలేకపోయింది. దీంతో కొన్నాళ్లకే తనను బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి పంపించేశారు మేకర్స్. ఒకవేళ కుమారి ఆంటీ వచ్చినా కూడా ఇదే రిపీట్ అవుతుందని బిగ్ బాస్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.


సీఎం సాయంతో..


ఒక్క వీడియోతో తన స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ అయిపోవడంతో జనాలంతా కుమారి ఆంటీని చూడడానికి క్యూ కట్టారు. దీంతో అక్కడే జనాలు ఎక్కువగా ఉంటున్నారని, ట్రాఫిక్‌తో ఇబ్బందులు కలుగుతున్నాయని జీహెచ్‌ఎంసీ యాజమాన్యం.. కుమారీ ఆంటీ స్టాల్‌ను మూసివేసింది. కానీ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి కుమారి ఆంటీ స్టాల్‌ను మళ్లీ ఓపెన్ అయ్యేలా చేశారు. దీంతో ఆమె సెలబ్రిటీ అయిపోయింది. యూట్యూబ్ ఛానెళ్లు వచ్చి తనను ఇంటర్వ్యూ తీసుకోవడం మొదలుపెట్టాయి. ఒక సీరియల్‌లో కూడా మెరిసింది. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ ఆఫర్ అనగానే కుమారి ఆంటీ లక్ బాగుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కానీ ఈ ఆఫర్‌తో బిగ్ బాస్ యాజమాన్యం తనను సంప్రదించినా.. కుమారి ఆంటీ మాత్రం ఇంకా ఏ సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది.


Also Read: ‘బిగ్ బాస్’లోకి ఎంట్రీ ఇవ్వనున్న ‘బ్రహ్మముడి’ కావ్య - ఇదిగో ఇలా హింట్ ఇచ్చేశారుగా, ఇక అల్లరే అల్లరి