NEET UG 2024 SCAM: దేశంలోని వివిధ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 557 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో పరీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా.. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో పలు పోస్టులు హల్‌చల్ చేశాయి. తాజాగా మరో సంచలన విషయం బయటపడింది. రూ.10 లక్షలు ఇస్తే.. నీట్ పరీక్షలో క్వాలిఫై అయ్యేలా చూస్తామంటూ కొందరు విద్యార్థులతో ఒప్పందం కుదుర్చుకున్న ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ స్కూల్ టీచర్ తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. గుజరాత్‌లోని ఓ నీట్ యూజీ పరీక్ష కేంద్రంలో ఈ గుట్టు రట్టయింది.
వివరాల్లోకి వెళితే.. మే 5న ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్షకు గుజరాత్‌లోని గోద్రాలో ఉన్న ఓ పాఠశాలలో సెంటర్ ఏర్పాటుచేశారు. అయితే ఆ కేంద్రంలో ఎగ్జామినేషన్ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా వ్యవహరించిన తుషార్ భట్ అనే ఫిజిక్స్ టీచర్ మరో ఇద్దరితో కలసి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం ఆరుగురు విద్యార్థులతో బేరం కుదుర్చుకున్నాడు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. ఇందులో ఒక విద్యార్థి నుంచి ఏకంగా రూ.7 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు.
నీట్ యూజీ పరీక్షలో జవాబులు తెలియని ప్రశ్నలను మార్కింగ్ చేయకుండా ఖాళీగా వదిలేసి ఆన్సర్ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు ఇస్తే సరిపోతుందని విద్యార్థులతో చెప్పారు. ఆ తర్వాత ఆ ప్రశ్నలకు సరైన జవాబులు రాస్తానని వారికి చెప్పాడు. కాగా ఈ విషయం బయటకు పొక్కడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏకంగా జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. వెంటనే ఆ పరీక్ష కేంద్రంపై దాడి చేసిన పోలీసులు తుషార్ భట్‌తోపాటు పరశురాం రాయ్, ఆరిఫ్ వోరా అనే ఇద్దరు బ్రోకర్లను కూడా అరెస్టు చేశారు. భట్ కారులోంచి రూ.7 లక్షల అడ్వాన్స్ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
పేపర్ లీక్ వార్తలు అవాస్తవం...
రాజస్థాన్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు హిందీ మీడియానికి బదులుగా ఇంగ్లిష్ మీడియం ప్రశ్నపత్రాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లీకేజీ వార్తలు ఫేక్ అంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టత ఇచ్చింది. విద్యార్థులకు నీట్ యూజీ ప్రశ్నపత్రాలను తప్పుగా ఇచ్చినట్లు పొరపాటు అంగీకరించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రశ్నపత్రం లీకేజీ వార్తలను మాత్రం ఖండించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టంచేసింది. రాజస్థాన్‌లోని సవాయ్ మాదోపూర్, మ్యాన్‌టౌన్‌లోని ఆదర్శ్ విద్యామందిర్(బాలికల హయ్యర్ సెకండరీ) పరీక్ష కేంద్రంలో హిందీ మీడియానికి బదులుగా ఇంగ్లిష్ మీడియం ప్రశ్నపత్రాలను పొరపాటుగా ఇచ్చారని, ఇన్విజిలేటర్ వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నాడని.. అయినా కూడా విద్యార్థులు ప్రశ్నపత్రంతో పరీక్ష హాలు నుంచి బలవంతంగా బయటకు వచ్చినట్లు ఎన్టీఏ తెలిపింది. నిబంధనల ప్రకారం పరీక్ష సమయం ముగిసే వరకు ప్రశ్నపత్రాలతో బయటకు రావడం విరుద్ధం. అయితే ఆ విద్యార్థులు బలవంతంగా తమకిచ్చిన ప్రశ్నపత్రాలతో బయటకు వెళ్లారు. ఆ క్వశ్చన్ పేపర్‌ను సాయంత్రం 4 గంటలకు ఇంటర్నెట్‌లో పెట్టారని ఎన్టీఏ తెలిపింది. అప్పటికే దేశంలోని ఇతర పరీక్ష కేంద్రాల్లో పరీక్ష ప్రారంభంకావడంతో నీట్ యూజీ 2024 ప్రశ్నపత్రం లీకేజీకి ఆస్కారం లేదంటూ ఎన్టీఏ స్పష్టతనిచ్చింది.
ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షకు రికార్డు స్థాయిలో విద్యార్థులు హాజరైనట్లు తెలుస్తోంది. మొత్తం 23.30 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. నీట్ పరీక్ష కోసం మొత్తం 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 10 లక్షల బాలురు, 13 లక్షల బాలికలు ఉన్నారు. రీజియన్లవారీగా చూస్తే మొత్తం దరఖాస్తుల్లో అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్- 3,39,125 దరఖాస్తులు, ఆ తర్వాత మహారాష్ట్ర 2,79,904 దరఖాస్తులు, రాజస్థాన్ 1,96,139 దరఖాస్తులు అందాయి. ఇక దక్షిణాన తమిళనాడు నుంచి 1,55,216 దరఖాస్తులు, కర్నాటక 1,54,210 దరఖాస్తులు అందాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 1.5 లక్షల మంది (ఏపీ 70 వేలు, తెలంగాణ 80 వేలు) విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.