TTD Srivari Arjitha Seva Tickets Schedule: తిరుమల (Tiruamala) శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఆగస్ట్ నెల టికెట్ల కోటా షెడ్యూల్ ను టీటీడీ (TTD) విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకూ ఆర్జిత సేవా టికెట్ల (Arjitha Seva Tickets) లక్కీ డిప్ రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించాలని.. వారికి లక్కీ డిప్ లో టికెట్లు జారీ అవుతాయని పేర్కొన్నారు. అలాగే, శ్రీవారి ఆర్జిత, కల్యాణం, ఊంజల్, బ్రహ్మోత్సవం, స్వచ్చంద సేవలతో పాటు వార్షిక పవిత్రోత్సవం టికెట్లు ఈ నెల 21న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవా టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంచనున్నారు. కాగా, శ్రీవారి ఆలయంలో ఆగస్ట్ 15 నుంచి 17 వరకూ వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. 


మిగిలిన టికెట్ల విడుదల ఎప్పుడంటే.?



  • ఈ నెల 23వ తేదీన ఆగస్ట్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.

  • అలాగే, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి ఆగస్ట్ నెల ఆన్ లైన్ కోటాను ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

  • అటు, ఆగస్ట్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.

  • వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారుశ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్ట్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.

  • అలాగే, తిరుమల, తిరుపతిల్లో ఆగస్ట్ నెల గదుల కోటాను ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

  • అటు, తిరుమల - తిరుపతి శ్రీవారి సేవా కోటాను ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in సైట్ ద్వారా శ్రీవారి ఆర్దిత సేవా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. 


తిరుమలలో భక్తుల రద్దీ


మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత సర్వ దర్శనానికి 8 గంటలు, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. అలాగే, టైమ్ స్లాట్ ఎస్ఎస్ డీ దర్శనం కోసం 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. గురువారం 65,508 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా.. 25,996 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ.2.97 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.


Also Read: Andhra Pradesh News: ఏపీలోనే హాటెస్ట్ నియోజకవర్గంలో కుమారీ అంటీ ఎన్నికల ప్రచారం- ఫైర్‌ బ్రాండ్‌పైనే విమర్శలు!