Gudivada Assembly Constituency : కుమారీ ఆంటీ పేరు తెలియని వాళ్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లేరు అంటే ఓవర్ యాక్షన్ కాదేమో. ఎవరైనా ఆమె ఎవరో తెలియదు అంటే మాత్రం వెంటనే మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో అనే డైలాగ్ వినిపిస్తుంది. అవును మరి. ఆమె అంత ఫేమస్ అయిపోయారు. ఫుడ్‌తో సోషల్ మీడియాతను తన చుట్టూ తిప్పుకున్న కుమారీ అంటీ తర్వాత వివాదాలతో ప్రభుత్వాలనే తనవైపు చూసేలా చేశారు. ఇప్పుడు అలాంటి ఆమె ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా సెన్సిటివ్‌గా తయారయ్యాయి. ఎప్పుడు ఎలాంటి విమర్శలు, ఎలాంటి ఎదురుదాడులు చేసిన ప్రచారానికి ప్రత్యర్థులు రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. అందుకే ఇలాంటి టైంలో ఎంత సైలెంట్‌గా ఉంటే అంత మంచిదని అంతా భావిస్తారు కానీ కుమారీ అంటీ మాత్రం తనకు నచ్చిన నేత ప్రచారానికి కదలారు.
కుమారీ అంటీ ఎన్నికల ప్రచారమే ఓ సెన్సేషన్ అయితే... ఆమే ప్రచారం చేస్తున్న నియోజకవర్గం కూడా అంత కంటే సెన్సేషన్. అవును కుమారీ ఆంటీ ప్రస్తుతం గుడివాడలో ప్రచారం చేస్తుండటం చాలా ఆసక్తిగా మారింది. గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము తరఫున ప్రచారం చేస్తున్నారు. గుడివాడలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్న కుమారీ అంటీ టీడీపీ మేనిఫెస్టోను వివరిస్తున్నారు. రామును గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతున్నారు.
ఇంకా ఏమన్నారంటే... మహర్షీ సినిమాలో మహేష్ బాబు లాంటి మనసున్న వ్యక్తి వెనిగండ్ల రాము. సినిమాలో మహేష్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే.. రాము రియల్ లైఫ్‌లో సేవ చేస్తారు. 15 ఏళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో... అభివృద్ధి లేకుండా ఇప్పటికీ అలాగే ఉంది. వెనిగండ్ల రాము గెలిస్తేనే గుడివాడ అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాను. అని మీడియాకు చెప్పుకొచ్చారు.
నా స్వస్థలమైన పేద ఎరుకపాడులో ప్రజలందరి మంచి కోసం ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉంది. నా స్వస్థలమైన గుడివాడ మీద మమకారంతో, గుడివాడలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో రాముకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాను. గుడివాడలో ఉపాధి అవకాశాలు, లేకపోవడంతో నాలాంటి వారు ఎందరో పక్క రాష్ట్రాలు వెళ్లి కష్టపడాల్సి వస్తుంది. కొడాలి నాని హయాంలో అభివృద్ధి లేకపోగా, ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడలేదు. చక్కటి విజన్ ఉన్న రాము కష్టపడే వారికి, విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. రాము లాంటి నాయకులు అధికారంలో ఉంటేనే మాలాంటివారికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా వెనిగండ్ల రామును, గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వల్లభనేని బాలశౌరిని గెలిపించి,ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాలి. అనిప్రచారం చేశారు.
జగన్ ఇచ్చిన ఆస్తి ఒకటే ఉందన్న కుమారి
అప్పట్లో తనకు ఊరిలో జగన్ ఇల్లు కట్టించి ఇచ్చాడని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం వైరల్‌గా మారింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న వైసీపీ... సామాన్యులే తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు అంటూ ప్రచారం చేసింది. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలాయి. సోషల్ మీడియాలో రచ్చ నడిచింది.
పవన్‌ను, చంద్రబాబును ట్యాగ్ చేసిన వైసీపీ తన ట్విట్ ఖాతాలో కుమారీ అంటీ ఇంటర్వ్యూను పోస్టు చేసింది. అందులో ఇలా రాసుకొచ్చింది. "సామాన్యులే నా స్టార్ క్యాంపెయినర్లు అని సీఎ జగన్ చెప్తే.. వెటకారం చేసిన పెత్తందారులకి దిమ్మతిరిగిపోయేలా చేసిన దాసరి సాయి కుమారి. సోషల్ మీడియాలో ఇటీవల ఫేమస్ అయిన ఆమె తనకంటూ ఆస్తి ఉందంటే.. అది జగనన్న ఇచ్చిన ఇల్లు మాత్రమే అని ఇంటర్వ్యూలో చెప్పింది. మంచి చేస్తే గుర్తింపు ఇలానే ఉంటుంది.. ఇప్పుడర్థమైందా పవన్, చంద్రబాబు " అంటూ ట్వీట్ చేసింది.
అలాంటి కుమారీ ఇప్పుడు ఏకంగా ఎన్డీఏ తరఫున ప్రచారం చేయడం కొడాలి నాని లాంటి లీడర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఆసక్తిగా మారింది.