India, Australia Sign Agreements: భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య విద్య, నైపుణ్య శిక్షణలో సహకారాన్ని ప్రోత్సహించడానికి సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. వ్యవసాయం, నీటి నిర్వహణ, క్లిష్టమైన ఖనిజాలు, ఆరోగ్య సంరక్షణ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, పునరుత్పాదక ఇంధనం, వాతావరణ మార్పులతో సహా వివిధ రంగాలలో పరిశోధన సహకారాన్ని ప్రోత్సహించడానికి రెండు దేశాల విద్యా సంస్థల మధ్య 5 అవగాహన ఒప్పందాల (MOU)ల మీద ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
ఐఐటీ గాంధీనగర్‌లో నవంబరు 6న 'ఆస్ట్రేలియా-ఇండియా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ కౌన్సిల్ (AIESC)' సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆస్ట్రేలియన్ విద్యా మంత్రి జాసన్ క్లేర్, ఆస్ట్రేలియా ప్రభుత్వ నైపుణ్య, శిక్షణ మంత్రి బ్రెండన్ ఓకానర్ తదితరులు హాజరయ్యారు. విద్య, పరిశోధన రంగాల్లో రెండు దేశాల మధ్య పరస్పర సహకారం, జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయడం, నైపుణ్యాభివృద్ధికి సహకరించడం, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల కోసం ఉన్నత విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని ఏర్పరచడం, ఉపాధ్యాయ సామర్థ్యాలను పెంపొందించడం, భారతీయ విద్యార్థులకు వీసా ప్రక్రియలను సులభతరం చేయడం వంటి అంశాల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. విద్య మరియు నైపుణ్యంలో తమ ద్వైపాక్షిక సహకారాన్ని ఇరు దేశాలు సమీక్షించుకున్నాయని, చలనశీలత, ఉపాధిని పెంచే లక్ష్యంతో విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధిలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అంగీకరించాయన్నారు. ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య ఉమ్మడి పరిశోధన, విద్యార్థి-అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలు, వ్యవసాయం, నీటి నిర్వహణ , ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో ద్వంద్వ, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల అమలుకు ఆస్కారం ఉంటుందని మంత్రి తెలిపారు.
MOU వివరాలు ఇలా..
ఇన్నోవేటివ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ కన్సార్టియం క్యాంపస్..
ఆస్ట్రేలియా, భారత్ దేశాల మధ్య విద్యారంగంలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఆస్ట్రేలియాలోని ఇన్నోవేటివ్ రిసెర్చ్ యూనివర్సిటీల కన్సార్టియంలోని 7 ప్రధాన యూనివర్సిటీలుగా పేరుగాంచిన ఫ్లిండర్స్ యూనివర్సిటీ, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, లా ట్రోబ్ యూనివర్సిటీ, మర్డోచ్ యూనివర్సిటీ, గ్రిఫిత్ విశ్వవిద్యాలయం, కాన్‌బెర్రా విశ్వవిద్యాలయం, వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయాలు ఎంఏయూ మీద సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం భారతదేశంలో డిగ్రీలను అందించడానికి, భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యకు అవకాశాలను మరింత విస్తరించడంపై దృష్టి సారించడానికి వీలు కలుగుతుంది.
డీకిన్ యూనివర్సిటీతో జతకట్టిన నేషనల్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్...
భారత్‌లోని యువతలో నైపుణ్యాల కొరతను పరిష్కరించడానికి 'గ్లోబల్ జాబ్ రెడినెస్ ప్రోగ్రామ్ (GJRP)' కోసం నేషనల్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సితో జతకట్టింది. మొత్తం 30 గంటల పాటు సాగే ఈ ఆన్‌లైన్ ప్రోగ్రామ్, యజమానుల ద్వారా అధిక డిమాండ్ ఉన్న నైపుణ్యాలపై దృష్టి సారించి, మూడేళ్లలో 15 మిలియన్ల భారతీయులకు నైపుణ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం భారతీయ యజమానులు గుర్తించిన జీవితం మరియు కార్యాలయ నైపుణ్యాలలో అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది మరియు దానిని సరసమైనదిగా మరియు విస్తృత ప్రేక్షకులకు అందుబాటులో ఉంచుతుంది.
డీకిన్ విశ్వవిద్యాలయం - ఐఐటీ గాంధీనగర్..
గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-(GIFT)సిటీలో క్యాంపస్‌ను స్థాపించిన డీకిన్ యూనివర్సిటీ. ఆ ప్రాంతంలో ఉన్నత విద్య మరియు పరిశోధనల నాణ్యతను మెరుగుపరచడానికి IIT గాంధీనగర్‌తో కలిసి పనిచేయనుంది. సహకారంలో సైన్స్, ఇన్నోవేషన్, ఫ్యాకల్టీ ఎక్స్ఛేంజ్, జాయింట్ డాక్టోరల్ ప్రోగ్రామ్‌లు, ద్వైపాక్షిక నిధుల అవకాశాలు, గ్రాంట్ ప్రతిపాదనలు, సమావేశాలు మరియు వర్క్‌షాప్‌ల ద్వారా విజ్ఞాన మార్పిడి వంటి విభాగాలు ఉన్నాయి. ఇది IIT గాంధీనగర్ విద్యార్థులకు ఆస్ట్రేలియాలోని డీకిన్ విశ్వవిద్యాలయంలో, GIFT సిటీలో ఉన్నత చదువులు మరియు పరిశోధనలను కొనసాగించేందుకు అవకాశాన్ని అందిస్తుంది.
మోనాష్ యూనివర్సిటీతో జతకట్టిన ఐఐటీ హైదరాబాద్..
ఈ అవగాహనా ఒప్పందాలు అకడమిక్, రీసెర్చ్ ప్రయత్నాలలో, ముఖ్యంగా క్లిష్టమైన ఖనిజాలు, ఇతర పరస్పర ఆసక్తికర రంగాలలో సహకారాన్ని వివరిస్తాయి. ఇది విద్యాసంబంధ వనరులు, పండితులు, విద్యార్థులను పంచుకోవడం, ఉమ్మడి సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు మరియు ఇతర విద్యా కార్యకలాపాలను నిర్వహించడం జరుగుతుంది.
మోనాష్ యూనివర్సిటీ - ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మైనింగ్..
భారతదేశపు మైనింగ్ & మినరల్ డెవలప్‌మెంట్ రంగానికి మద్దతుగా మోనాష్ యూనినవర్సిటీ -ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మైనింగ్ మధ్య పరిశోధన, ఆవిష్కరణ సహకారాన్ని ప్రోత్సహించడం ఈ MOU లక్ష్యం. మైనింగ్ యొక్క పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి, దాని సామర్థ్యాన్ని పెంచడానికి, క్లిష్టమైన ఖనిజాలు, అరుదైన భూ మూలకాలలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి అవసరమైన సహకారంపై ఈ ఒప్పందం దృష్టి పెడుతుంది.