Telangana Election 2023: ఏదో ఓ రోజు తాను సీఎం అవుతానని, కానీ తనకు సీఎం కావాలనే ఆశ లేదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనుచరులు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ అధికారులకు సమర్పించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అబద్ధాలు చెప్పి గెలిచిందని, ఇప్పుడు అందరూ విచక్షణతో ఆలోచించి ఓటెయ్యాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.


'నా హయాంలోనే అభివృద్ధి'


నియోజకవర్గంలో అభివృద్ధి అంతా తన హయాంలోనే జరిగిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. రాజకీయంగా నష్టం వస్తుందని తెలిసినా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. పోలింగ్ కు ముందు రైతు బంధు వేస్తారని, దాన్ని చూసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండిచేయి చూపించిందని, ఉద్యోగాల భర్తీలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈసారి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


Also Read: Congress Third List Controversy: కాంగ్రెస్ లో మూడో జాబితా చిచ్చు - పటాన్ చెరులో ఉద్రిక్తత, జాబితాపై దామోదర రాజనర్సింహ అసంతృప్తి