డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్.. బజ్ బాల్ క్రికెట్‌తో బ్యాటింగ్ చేసే పద్ధతిని సమూలంగా మార్చేసిన జట్టు. మ్యాచ్ గెలవాలంటే విధ్వంసమే మార్గమనేలా చేసిన జట్టు. వన్డే, టీ 20 ప్రపంచకప్‌లను కైవసం చేసుకుని దూకుడు మీదుంది. కానీ భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో బ్రిటీష్ జట్టు పాచికలు పారలేదు. ఈ డిఫెండింగ్ ఛాంపియన్.. పసికూనగా మారిపోయింది. అఫ్ఘానిస్థాన్ లాంటి జట్లు కూడా ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించి ఘన విజయం సాధించింది. అసలు పోరాటమే లేకుండా బ్రిటీష్ జట్టు తేలిగ్గా చేతులెత్తేసింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లు అడిన ఇంగ్లండ్ కేవలం ఒకే విజయం ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ కంటే బ్రిటీష్ జట్టు తక్కువ విజయాలు సాధించింది. అసలు పసికూనలు కూడా రెండు విజయాలు సాధిస్తే పాపం ఇంగ్లండ్‌కు అది కూడా సాధ్యం కాలేదు. సరైన ప్రణాళికలు లేకపోవడం... అతి విశ్వాసం.. జట్టు కూర్పులో లోపం వల్ల ఇంగ్లండ్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోర పరాజయాలను మూటగట్టుకుని ప్రపంచకప్ రణ క్షేత్రం నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. అతి విశ్వాసం కంటే ఆత్మ విశ్వాసం గొప్పదని చిన్నజట్లు..ఈ అగ్ర శ్రేణి జట్టుకు గట్టి గుణపాఠమే చెప్పాయి.
శ్రీలంక... మాజీ ప్రపంచ ఛాంపియన్. దిగ్గజ ఆటగాళ్లతో లంక బరిలోకి దిగుతుందంటేనే ప్రత్యర్థి జట్టు అప్రమత్తంగా ఉండేది. కానీ ఈ ప్రపంచకప్‌లో లంకేయుల ప్రదర్శన మరీ దారుణంగా మారిపోయింది. ఎనిమిది మ్యాచుల్లో రెండే విజయాలతో లంక ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ చేతుల్లోనూ చావదెబ్బ తిని లంక మహా సంగ్రామం నుంచి అవమాన బారంతో వెనుదిరిగింది. కీలక ఆటగాళ్లు దూరం కావడం, గాయాలు, క్రికెట్ బోర్డులో రాజకీయాలు ఇలా కారణమేదైనా లంక జట్టు ఇప్పుడు పసికూన కంటే ఘోరంగా మారిపోయారు. ఇంగ్లండ్, నెదర్లాండ్స్ మినహా మరే జట్టుపైనా లంక విజయం సాధించలేదు. టీమిండియాపై ఆసియాకప్‌లోనూ, ప్రపంచకప్‌లోనూ భారత్‌పై లంక 60 పరుగుల లోపే ఆలౌటైంది. ఇలా వరుసగా తక్కువ పరుగులకే ఆలౌటై లంక జట్టు ఆనాటి వైభవాన్ని క్రమంగా కోల్పోతోంది. ఒకపక్క అఫ్గాన్ జట్టు పసికూన నుంచి అగ్రజట్టుగా పరిణితి చెందుతుంటే లంక వెస్టిండీస్ తరహాలో పాతాళానికి పడిపోతుంది. ఎన్నో కష్టాల మధ్య కూడా అఫ్గాన్ సంచలనాలు సృష్టిస్తుంటే లంక ఆటగాళ్లు కనీస పోరాటం చేయకుండా కాడి వదిలేస్తుండడం క్రికెట్ అభిమానులకు తీవ్ర నిర్వేదానికి గురి చేస్తోంది.
పాకిస్థాన్‌ది అదే కథ. మాజీ ప్రపంచ ఛాంపియన్ అన్న హోదా... క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ పేస్ బౌలింగ్ దళం ఉందన్న అంచనాలు.. నెంబర్ వన్ బ్యాటర్.. నెంబర్ వన్ బౌలర్లు ఉన్నారన్న గణాంకాలు... ఇవేమీ పాకిస్తాన్ పరాజయాలను ఆపలేకపోయాయి. సెమీఫైనల్ చేరడమని ఖాయమనుకున్న జట్టు ఇప్పుడు... వేరే జట్ల గణాంకాలపై ఆధారపడాల్సి వచ్చింది. అఫ్గాన్ చేతిలో పరాజయం తర్వాత పాక్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నా పాక్ ఆటతీరు మాత్రం అగ్ర జట్టులాగా లేదన్నది కాదనలేని నిజం.
అప్ఘానిస్థాన్, నెదర్లాండ్స్ కథ వేరు. పసికూన స్థాయి నుంచి అఫ్గాన్ అగ్ర జట్టుగా ఎదుగుతుండగా... నెదర్లాండ్స్ సంచలనాలు నమోదు చేస్తూ అస్తిత్వాన్ని చాటుకుంటుంది. వెస్టిండీస్ లాంటి జట్టును మట్టికరిపించి ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన నెదర్లాండ్స్ జట్టు... దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్‌కు కూడా షాక్ ఇచ్చి ప్రపంచ కప్‌లో రెండు విజయాలు నమోదు చేసింది. అఫ్గాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్‌లు ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్‌లు షాక్ ఇచ్చి ఇప్పుడు అగ్ర జట్టుగా రూపాంతరం చెందింది. అఫ్గాన్‌తో మ్యాచ్ అంటే అగ్ర జట్లు కూడా సరైన ప్రణాళికతో బరిలోకి దిగే పరిస్థితికి తీసుకొచ్చింది. అగ్రశ్రేణి జట్లు తస్మాత్ జాగ్రత్తగా లేకపోతే... పసికూనల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది మరి.