Mathews Timed Out Row : భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఏంజెలో మాథ్యూస్‌ టైమ్డ్‌ అవుట్‌ కావడం వివాదంగా మారింది. క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. మాథ్యూస్‌ విజ్ఞప్తి చేసినా కెప్టెన్ షకీబుల్‌ హసన్‌ టైమ్డ్‌ అవుట్‌ అప్పీల్‌ను వెనక్కి తీసుకోకపోవడంపై క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. షకీబుల్‌ హసన్‌ను అప్పీల్‌ను ఓ సిగ్గుమాలిన చర్యగా కూడా మాథ్యూస్‌ విమర్శించాడు. అయితే టీమిండియా మాజీ సారధి సౌరవ్‌ గంగూలీ టైమ్డ్‌ అవుట్‌ బారిన పడేవాడు. కానీ ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ క్రీడా స్ఫూర్తి కారణంగా బెంగాల్‌ ప్రిన్స్‌ అప్పుడు ఈ టైమ్డ్‌ అవుట్ నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. మాథ్యూస్‌ టైమ్డ్‌ అవుట్‌ తర్వాత ఇప్పుడు అందరూ గంగూలీ ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..


సరిగ్గా 16 ఏళ్ల క్రితం 2007లో భారత మాజీ కెప్టెన్, బెంగాల్ టైగర్‌ సౌరవ్ గంగూలీ తొలి టైమ్‌ అవుట్ బ్యాట్సమెన్‌గా అపఖ్యాతి మూటగట్టుకునే వాడు. 2007లో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. కేప్‌టౌన్‌ వేదికగా ఇరు జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ నాలుగో రోజు టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో కేవలం ఆరు పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. విధ్వంసకర ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్, జాఫర్‌లు ఇంత త్వరగా ఔట్ అవుతారని టీమ్ ఇండియా ఊహించలేదు. సచిన్ టెండూల్కర్ నాల్గో నంబర్‌లో బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది, కానీ దక్షిణాఫ్రికా బ్యాటింగ్ సమయంలో అతను చాలా సేపు ఫీల్డింగ్‌కు దూరంగా ఉండడంతో నిబంధనల ప్రకారం నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే వరకు అతను బ్యాటింగ్‌కు రాలేకపోయాడు. సచిన్‌ బ్యాటింగ్‌కు వెళ్తాడన్న ఉద్దేశంతో గంగూలీ బ్యాటింగ్‌కు సిద్ధం కాలేదు. 


ఈ గందరగోళం మధ్య గంగూలీ బ్యాటింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో బ్యాట్స్‌మెన్‌ అవుటైన తర్వాత కొత్త బ్యాట్స్‌మెన్‌ మూడు నిమిషాల్లోపు బంతిని ఎదుర్కోవాలి. కానీ గంగూలీ బ్యాటింగ్‌కు వెళ్లేందుకు 6 నిమిషాల సమయం పట్టింది. అప్పుడు దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్ ఉన్నాడు. గంగూలీ చాలా ఆలస్యంగా వచ్చాడని... అతడిని టైమ్డ్‌ అవుట్‌గా ప్రకటించవచ్చని అంపైర్‌... కెప్టెన్‌ గ్రేమ్ స్మిత్‌కు గుర్తు చేశాడు. అప్పుడు స్మిత్ అప్పీల్‌ చేసి ఉంటే గంగూలీ తొలి టైమ్డ్‌ అవుట్‌ బ్యాటర్‌ అయ్యేవాడు. కానీ స్మిత్‌  క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ అప్పీల్ చేయకపోవడంతో గంగూలీ టైమ్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు.


ఒకవేళ స్మిత్ అప్పీల్ చేసి ఉంటే క్రికెట్ చరిత్రలో టైం ఔట్ అయిన తొలి బ్యాటర్‌గా గంగూలీ..... రెండో ఆటగాడిగా ఏంజెలో మాథ్యూస్ నిలిచి ఉండేవాడు. 146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో తొలిసారి శ్రీలంక క్రికెటర్‌ ఏంజెలో మాథ్యూస్‌ టైమ్‌డ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. రెండు నిమిషాల్లోగా అతను బంతిని ఎదుర్కోకపోవడంతో మాథ్యూస్‌ను అంపైర్లు టైమ్ ఔట్‌గా ప్రకటించారు. దీంతో అతడు ఒక్క బంతి ఆడకుండానే పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంతవరకూ ఏ ఒక్క బ్యాటర్ కూడా ఈ విధంగా ఔట్ అవ్వలేదు. ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. మాధ్యూస్‌ను టైమ్డ్‌ అవుట్‌ అంటూ అప్పీల్‌ చేశాడు. అంపైర్లు రెండుసార్లు అప్పీల్‌ను వెనక్కి తీసుకోవాలని కోరినా షకీబుల్‌ హసన్‌ నిరాకరించడంతో ఏంజెలో మాధ్యూస్‌ కోపంగా పెవిలియన్‌కు చేరాడు. ఇప్పుడు ఈ ఘటనపై మాధ్యూస్‌ స్పందించాడు. బంగ్లాదేశ్‌ కాకుండా మరే ఇతర జట్టు మైదానంలో ఉన్నా ఇలా టైమ్డ్‌ అవుట్‌ కోసం అప్పీల్‌ చేసి ఉండేది కాదని అన్నాడు.