హైదరాబాద్ నగర విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో ప్రయాణించడానికి అనుమతి ఇచ్చింది. అంటే సిటీ బస్సులతోపాటు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనూ విద్యార్థులు ప్రయాణం చేయవచ్చు. ఈ మేరకు ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. విద్యార్థుల రద్దీ దృష్ట్యా టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని, సదుపాయాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులకు ఉపశమనం కలుగనుంది. ఇంజినీరింగ్ కాలేజీలు తమ సొంత వాహన సర్వీసుల కోసం 10 నెలల కాలానికి విద్యార్థుల నుంచి రూ. 30 వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేస్తుండగా.. అదే సమయంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి 10 నెలల కాలానికి కేవలం రూ. 4 వేలు మాత్రమే ఖర్చవుతుంది. ప్రస్తుతం కేవలం 500 బస్సులు మాత్రమే శివారులోని కళాశాలలకు నడుస్తున్నాయి. విద్యార్థుల రద్దీకి ఇవి ఏమాత్రం సరిపోవడంలేదు. తాజాగా ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు బస్సుల కొరత తీరనుంది.
నగర శివారులోని వివిధ ప్రాంతాల్లో వందలాదిగా ఇంజినీరింగ్, ఒకేషనల్, ఐటీఐ తదితర కళాశాలలు ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు వీటిలో చదువుకుంటున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న బస్సులు సుమారు 1,500 వరకు ఉన్నాయి. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు సైతం ఈ బస్సుల్లో వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అప్పటికే కిక్కిరిసిపోయిన బస్సుల్లో విద్యార్థులు ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు.
ఇదీ ప్రస్తుత పరిస్థితి..
♦ నగర శివార్లలోని వివిధ ప్రాంతాలకు ప్రతిరోజు 1500 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. రద్దీ దృష్ట్యా మరో 80 బస్సులు అదనంగా నడుపుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ... అవి విద్యార్థులకు సరిపోవడం లేదు.
♦ మేడ్చల్‌లోని కండ్లకోయ, మేడ్చల్, మైసమ్మగూడ, కీసర, ఘట్‌కేసర్ తదితర ప్రాంతాల్లో 50కి పైగా కాలేజీలు ఉన్నాయి. వీటిలో 10వేల మందిపైగా విద్యార్థులు ఉన్నారు. కానీ విద్యార్థుల రద్దీకి సరిపడా బస్సులు లేవు.
♦ మేడ్చల్ – సికింద్రాబాద్, ఘట్‌కేసర్ – భోగారం, ఘట్‌కేసర్ – అవుషాపూర్ రూట్లలోనూ బస్సుల కొరత తీవ్రంగా ఉంది.
♦ ఎల్‌బీనగర్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై హయత్‌నగర్ మొదలుకొని 12 ఇంజినీరింగ్ కళాశాలలు, నాగార్జునసాగర్ రహదారిపై దాదాపు 12 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ మార్గాల్లో ప్రయాణానికి విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు.
♦ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి శివారు ప్రాంతాల్లో ఉన్న 12 ఇంజినీరింగ్ కళాశాలలు, పలు జూనియర్ కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. వీరి కొందరు కాలేజీ బస్సుల్లో వస్తున్నప్పటికి చాలా మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడుతున్నారు.
విద్యార్థుల డిమాండ్, రద్దీకి తగ్గట్లు బస్సులు ఏమాత్రం లేవు. దీంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. బైక్‌లపై వేగంగా వెళుతూ అదుపు తప్పి పడిపోతున్నారు. ఇలా ఏటా అనేక మంది ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నారు. మృత్యువాత పడుతున్న సంఘటనలు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు వారికి నచ్చిన బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కలుగనుంది.