IIT Outside India: భారత్ లోని అత్యున్నత విద్యా సంస్థల్లో మొదటి వరుసలో ఉంటాయి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లు. ఉన్నత స్థాయి ప్రమాణాలతో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో విద్యా బోధన సాగుతుంది. విదేశీ విద్యా సంస్థలకు పోటీగా ఐఐటీల్లో విద్యా ప్రమాణాలు ఉంటాయి. అత్యున్నత సాంకేతికత, పరిశోధన తరహాలో విద్య, అత్యున్నత సంస్థలతో కలిసి విద్యా బోధన లాంటి అంశాలు ఐఐటీలను మిగతా విద్యా సంస్థలతో పోలిస్తే ఉన్నతంగా ఉంచుతున్నాయి. ఈ అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలకు నాయకత్వం వహిస్తుండటం తెలిసిందే. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఖరగ్‌పూర్ ఐఐటీలో మెటలర్జికల్ ఇంజినీరింగ్ చేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, ఐబీఎం సీఈవో అర్వింద్ కృష్ణా సహా పలువురు ఐఐటీ పూర్వ విద్యార్థులు ప్రపంచ దిగ్గజ సంస్థలను ముందుండి నడిపిస్తున్నారు. 


భారత్ లో ఐఐటీలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అత్యున్నత విద్యా సంస్థల్లో చదువుకునేందుకు ఏటా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడుతుంటారు. ఐఐటీల్లో చదువుకునేందుకు చిన్నప్పటి నుంచే కోచింగ్ లు కూడా ఇస్తున్నారంటేనే ఈ విద్యా సంస్థలకు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఐఐటీలను మొదటి సారి భారత్ బయట విదేశాల్లో నెలకొల్పేందుకు కేంద్ర సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాలోని జంజిబార్ లో ఐఐటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు టాంజానియా దేశ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని వెల్లడించింది. 


Also Read: Scholarships 2023: 9వ తరగతి నుంచి పీజీ వరకు స్కాలర్‌షిప్‌లు, నెలకు ఎంతవస్తుందో తెలుసా?


ఈ ఒప్పందంలో భాగంగా ఐఐటీ మద్రాసుకు చెందిన క్యాంపస్ ను టాంజానియాలోని జాంజిబార్ లో ఏర్పాటు చేయనున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాంజిబార్ ప్రెసిడెంట్ హుస్సేన్ అలీ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ప్రస్తుతం విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ టాంజానియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. భారత్, టాంజానియాల మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహ బంధాల నేపథ్యంలో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ను జాంజిబార్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. 


నూతన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న లక్ష్యాల మేరకు టాంజానియాలో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ను ఏర్పాటు చేయబోతున్నారు. భారత దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల క్యాంపస్ లను విదేశాల్లో ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించాలని కొత్త జాతీయ విద్యా విధానం లో స్పష్టంగా పేర్కొన్నారు. టాంజానియా ఐఐటీ క్యాంపస్ లో అకడమిక్ ప్రోగ్రామ్స్ 2023 అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.






Join Us on Telegram: https://t.me/abpdesamofficial