Ponguleti Meet CM Jagan :  తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాడేపల్లిలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన ఏ అంశంపై కలిశారన్న దానిపై స్పష్టత లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం జగన్  కు సన్నిహితునిగా  పేరు ఉంది. ఆయన రాజకీయ రంగ ప్రవేశం వైఎస్ఆర్‌సీపీ ద్వారానే జరిగింది. ఆ పార్టీ తరపున మొదట ఖమ్మం ఎంపీగా  గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే అక్కడ ప్రాధాన్యం దక్కక పోవడంతో ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనూహ్యంగా ఇప్పుడు జగన్ ను కలిసేందుకు తాడేపల్లికి రావడం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.


పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలకు ఏపీలో పలు కాంట్రాక్టులు


పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్  స్ట్రక్షన్ కంపెనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన పలు కంపెనీలు ఏపీలో కాంట్రాక్టులు పొందాయి. కడపలో వరదల ధాటికి కొట్టుకుపోయిన  అన్నమయ్య ప్రాజెక్టు పునర్ నిర్మాణ కాంట్రాక్ట్ కూడా పొంగులేటి కంపెనకే దక్కింది.  రూ.660 కోట్లతో టెండర్‌ ఖరారైంది. గత నెలలోనే అధికారులు రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రాజెక్టు అంచనా వ్యయం కంటే... ఎక్కువ ధరకు టెండర్‌ను ఖరారు చేశారు. త్వరగానే ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  మైనింగ్ శాఖ… సీవరేజీ వసూలును ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించింది.  రెండు, మూాడు జిల్లాల్లో సీవరేజీ  వసూలు చేసే కాంట్రాక్టులు కూడా పొంగులేటి కుటుంబానికి చెందిన కంపెనీలకే దక్కాయి. 


సీఎం జగన్‌తో సన్నిహిత సంబంధాలు
 
అలాగే  ఏపీలో త్వరలోనే వ్యవసాయ మోటార్లు, నివాస గృహాలకు స్మార్ట్ మీటర్లను బిగించనున్నారు. ఇందుకు కోసం దక్షిణ, మధ్య డిస్కమ్‌లలో టెండర్లను ఖరారుచేశారు.  రూ.4,592 కోట్ల విలువైన టెండర్లను రాఘవ కన్‌స్ట్రక్షన్స్, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.  ఇందులో ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన రూ.2056.95 కోట్ల విలువైన పనులను రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు దక్కినట్లుగా తెలుస్తోంది. ఉత్తారంధ్రలోనూ రాఘవ  కన్  స్ట్రక్షన్స్ కొన్ని ప్రాజెక్టుల కాంట్రాక్టులు పొందింది. ఈ క్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డితో పొంగులేటికి దగ్గర సంబంధాలు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.                                


షర్మిల పార్టీ  అంశంపైనా చర్చించి ఉంటారా ? 


తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల షర్మిల చేరుతారన్న ప్రచారం ఎక్కువగా ఉంది.  ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని అంటున్నారు. అయితే ఆమె ఏపీలో రాజకీయాలు చేస్తేనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని తెలంగాణ నేతలు పార్టీ హైకమాండ్ పై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల పార్టీ విషయంపైనా పొంగులేటి జగన్‌తో చర్చించి ఉంటారని భావిస్తున్నారు.