CLAT 2025 Application: దేశవ్యాప్తంగా ఉన్న 24 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి 'కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2025' పరీక్ష కోసం కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (Consortium of National Law Universities) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలో మెరుగైన ర్యాంకు సాధించిన విద్యార్థులకు యూజీ, పీజీ డిగ్రీ ప్రోగ్రాంలు(ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం)లో ప్రవేశాలు పొందుతారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జులై 15న ప్రారంభంకాగా.. అక్టోబరు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 1న క్లాట్-2025 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
వివరాలు..
✸ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2025
పాల్గొనే విశ్వవిద్యాలయాలు: ఎన్‌ఎస్‌ఐయూ (బెంగళూరు), నల్సార్ (హైదరాబాద్), ఎన్‌ఎల్‌ఐయూ (భోపాల్), డబ్ల్యూబీఎన్‌యూజేఎస్ (కోల్‌కతా), ఎన్‌ఎల్‌యూ (జోధ్‌పూర్), హెచ్‌ఎన్‌ఎల్‌యూ (రాయ్‌పూర్), జీఎన్‌ఎల్‌యూ (గాంధీనగర్), ఆర్‌ఎంఎల్ ఎన్‌ఎల్‌యూ (లఖ్‌నవూ), ఆర్‌జీఎన్‌యూఎల్ (పంజాబ్), సీఎన్‌ఎల్‌యూ (పట్నా), ఎన్‌యూఏఎల్‌ఎస్ (కొచ్చి), ఎన్‌ఎల్‌యూవో (ఒడిశా), ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్ (రాంచీ), ఎన్‌ఎల్‌యూజేఏ (అసోం), డీఎస్‌ఎన్‌ఎల్‌యూ (విశాఖపట్నం), టీఎన్‌ఎన్‌ఎల్‌యూ (తిరుచిరాపల్లి), ఎంఎన్‌ఎల్‌యూ (ముంబయి), ఎంఎన్‌ఎల్‌యూ (నాగ్‌పుర్), ఎంఎన్‌ఎల్‌యూ (ఔరంగాబాద్), హెచ్‌పీఎన్‌ఎల్‌యూ (షిమ్లా), డీఎన్‌ఎల్‌యూ (జబల్‌పూర్), డీబీఆర్‌ఏఎన్‌ఎల్‌యూ (హరియాణా), ఎన్‌ఎల్‌యూటీ (అగర్తల).
కోర్సులు..
✪ అండర్‌గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రోగ్రామ్ (ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)
అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. వచ్చే ఏడాది మార్చి/ ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలు రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
కోర్సు వ్యవధి: 5 సంవత్సరాలు.
✪ పీజీ ప్రోగ్రామ్ (ఎల్ఎల్ఎం డిగ్రీ)
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఎల్ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణత. వచ్చే ఏడాది ఏప్రిల్/మేలో జరిగే లా డిగ్రీ పరీక్షలు రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు వ్యవధి: ఏడాది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.4000. ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.3,500 చెల్లించాలి.
క్లాట్ పరీక్ష విధానం..
క్లాట్ యూజీ:
మొత్తం 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 120 ప్రశ్నలు అడుగుతారు. మల్టిపుల్ చాయిస్‌లో ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్, కరెంట్ అఫైర్స్‌తో సహా జనరల్ నాలెడ్జ్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ మరియు క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఐదు విభాగాలుగా విభజించారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 22-26 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 20 శాతం, కరెంట్ అఫైర్స్/ జనరల్ నాలెడ్జ్ నుంచి 28-32 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 25 శాతం, లీగల్ రీజనింగ్ నుంచి 28-32 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 25 శాతం, లాజికల్ రీజనింగ్ నుంచి 22-26 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 20 శాతం, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుంచి 10-14 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 10 శాతం ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు.
పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్:
పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. కాన్‌స్టిట్యూషనల్ లా 60 ప్రశ్నలు–60 మార్కులు, ఇతర లా సబ్జెక్టులు(జ్యూరిస్‌ప్రుడెన్స్, అడ్మినిస్ట్రేటివ్ లా, లా ఆఫ్ కాంట్రాక్ట్, టార్ట్స్, ఫ్యామిలీ లా క్రిమినల్ లా, ప్రాపర్టీ లా, కామన్ కంపెనీ లా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, ట్యాక్స్ లా, ఎన్విరాన్‌మెంటల్ లా, లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా, ఐపీఆర్ తదితర) నుంచి 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 15.07.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.10.2024.
➥ క్లాట్-2025 పరీక్ష తేది: 01.12.2024. (2PM - 4PM)