AP Assembly Approves Two Bills: ఏపీ అసెంబ్లీలో (AP Assembly) మంగళవారం పలు కీలక బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ - 2022 (భూ యాజమాన్య హక్కు చట్టం), ఆరోగ్య వర్శిటీ పేరు మార్పు బిల్లులకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో విజయవాడలోని (Vijayawada) ఆరోగ్య వర్శిటీకి ఎన్టీఆర్ పేరు పునరుర్ధరించారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) సభలో కీలక ప్రకటన చేశారు. అయితే, ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ సభలో ప్రకటించారు. పూర్తిగా తెలుగులోనే సభాపతి ప్రకటన చేయడంపై సభ్యులు అభినందనలు తెలిపారు.
స్పీకర్ ప్రశ్నోత్తరాలు
అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన 'నాడు - నేడు' పనుల్లో భారీగా అవినీతి జరిగిందని.. టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రవణ్ కుమార్, ఏలూరి సాంబశివరావు సభలో ప్రస్తావించారు. దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా.. మంత్రి నారా లోకేశ్ స్పందించారు. 'నాడు - నేడు'పై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పారు. అలాగే, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తామని.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు స్కూళ్లను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. 'గతంలో నాసిరకం పనులు ఎందుకు చేపట్టారు.? పనులు ఎందుకు సరిగ్గా జరగలేదు.?' ఆరా తీస్తామని అన్నారు.
తొలి ఏడాదిలో 'కేజీ టు పీజీ' వ్యవస్థ ప్రక్షాళన చేపడతామని మంత్రి లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య పెంచుతామని.. అందుకే మెగా డీఎస్సీ వేశామని చెప్పారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని.. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఓ పద్ధతి ప్రకారం అన్నీ చేస్తామని స్పష్టం చేశారు.
గ్రూప్ - 1 పరీక్షపై
గ్రూప్ - 1 ఉద్యోగాల నియామక పరీక్షపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అసెంబ్లీలో ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని.. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. సభ్యుల సూచన మేరకు సీబీఐ విచారణను పరిశీలిస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇచ్చారు. గతంలో గ్రూప్ - 1 పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగింది నిజమేనని.. దీనిపై కోర్టులో విచారణ జరుగుతుందన్నారు. దీనిపై ప్రభుత్వం కూడా విచారణ కమిటీ వేసిందని.. ఆగస్ట్ 31లోగా నివేదిక వస్తుందని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా సభ్యులు కోరిన విధంగా సీబీఐ విచారణపై పరిశీలిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Also Read: Amaravathi : ఆంధ్రప్రదేశ్ రాజధానికి గోల్డెన్ డేస్ - ఇక పరుగులు పెట్టనున్న అమరావతి నిర్మాణం !