India's Elite Dog Squad Deployed For Security At Summer Games Venue: నాలుగేళ్లకు ఒకసారి జరిగే విశ్వ క్రీడలకు సర్వం సిద్ధమైంది. ప్రపంచం దృష్టంతా కేంద్రీకృతమై పారిస్‌ ఒలింపిక్స్‌(Paris Olympics 2024) మరో రెండు రోజుల్లో అంగరంగ వైభవంగా ఆరంభం కానున్నాయి. ప్రపంచ దేశాల నుంచి 10 వేల 500 మంది అథ్లెట్లు ఈ క్రీడల మహా కుంభమేళాలో పతక కలను నెరవేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంతటి క్రీడా సంరంభంపై ముష్కరులు కూడా కన్నేస్తారు. ఇక్కడ ఏ చిన్న ఘటన జరిగినా ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చన్న తలంపుతో కుట్రలకు తెరలేపుతారు. అయితే ఈ కుట్రలను, కుతంత్రాలను భగ్నం చేసేందుకు ఒలింపిక్‌ కమిటీతో పాటు ఫ్రాన్స్‌ ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. చీమ చిటుక్కుమన్నా వెంటనే తెలిసిపోయేలా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తోంది. 24 గంటల పాటు కంటి మీద రెప్ప వాల్చకుండా వేల మంది సిబ్బంది భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు. ఒలింపిక్స్‌ క్రీడల ఆరంభ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి (Olympic Games Paris 2024) 
సాయం చేసేందుకు భారత్‌ నుంచి సుశిక్షితమైన జాగిలాలు ఇప్పటికే విధులు నిర్వహిస్తున్నాయి. 

 

మన జాగిలాలతో భద్రత 

ఫ్రాన్స్‌లో జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల భద్రతలో భారత్‌(India) కూడా పాలు పంచుకుంది. భద్రతలో తమకు సహకరించాలని ఫ్రెంచ్‌ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అంగీకారం తెలిపిన మోదీ ప్రభుత్వం... భారత్‌ నుంచి K9 (India's elite ITBP K-9 team)విభాగానికి చెందిన జాగిలాలను ఫ్రాన్స్‌కు పంపింది. ఒలింపిక్స్‌కు పంపే ముందు ఈ జాగిలాలను ప్రత్యేకంగా ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చారు. ఈ 10 మంది జాగిలాల బృందంలో ఆరు బెల్జియన్ షెపర్డ్‌లు, మూడు జర్మన్ షెపర్డ్‌లు, ఒక లాబ్రడార్ రిట్రీవర్ జాతి శునకాలు ఉన్నాయి. ఇవి ఇప్పటికే పారిస్‌ చేరి ఒలింపిక్‌ విలేజ్‌లో భద్రతలో నిమగ్నమయ్యాయి. ఒలింపిక్స్ గ్రామం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తూ భారత భద్రత సత్తాను చాటుతున్నాయి. 

 

పటిష్ట భద్రత - Paris Olympics 2024 Updates in Telugu

పారిస్‌ ఒలింపిక్స్‌లో రోజుకు 30,000 మంది భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ దాదాపు 30,000 మంది పోలీసు అధికారులు భద్రత విధుల్లో ఉంటారని ఫ్రాన్స్‌ ప్రభుత్వం వెల్లడించింది. సీన్ నదిలో నిర్వహించే ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకల కోసం దాదాపు 50 వేలమందితో భద్రత కల్పిస్తున్నారు. ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చడంలో కీలక పాత్ర పోషించిన బెల్జియన్ మలినోయిస్ జాతి జాగిలాలను కూడా పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడా గ్రామంలో ఫ్రాన్స్‌ మోహరించింది. ఐఈడీలు, మందుపాతరలు, బాంబుల సహా ఏ చిన్న అనుమానం వచ్చిన వెంటనే గుర్తించేలా శునకాలకు ప్రత్యేకమైన ట్రైనింగ్‌ కూడా ఇచ్చారు. పారిస్‌ ఒలింపిక్‌ విలేజ్‌లో ఏదైనా అనుమానాస్పద వస్తువు ఉనికిని చాలా వేగంగా గుర్తించేలా ప్రత్యేక సెన్సర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ భద్రత కోసమే ఫ్రాన్స్‌ ప్రభుత్వం బిలియన్‌ డాలర్ల నిధులను కేటాయించింది.