Campus Recruitments: తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం ప్రాంగణ నియామకాలు దారుణంగా పడిపోయాయి. రాష్ట్రంలోని టాప్ ఇంజినీరింగ్ కళాశాలల్లో గతేడాదితో పోలిస్తే.. ఈసారి 50 శాతానికిపైగా నియామకాలు తగ్గిపోయాయి. ఇక ద్వితీయ శ్రేణి కళాశాలల్లో అయితే నాలుగో వంతు విద్యార్థులకు ఉద్యోగాలు దక్కలేదు. చిన్న కళాశాలల్లో అయితే ప్రాంగణ నియామకాల ఊసే లేకుండా పోయింది. ఒక్క మన రాష్ట్రం, దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు. అమెరికాతోపాటు యూరప్‌లో నెలకొన్న ఆర్థిక మందగమనమే అందుకు ముఖ్య కారణమని, అక్కడి నుంచి ఐటీ ప్రాజెక్టులు రావడం తగ్గిందని, ఆ ప్రభావం మన దేశంపై తీవ్రంగా పడిందని వారు పేర్కొంటున్నారు.
ఈసారి 50 శాతంలోపే..
➥ తెలంగాణ రాష్ట్రంలో ఏటా 50 వేల నుంచి 60 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులై బయటకు వస్తుంటారు. వీరిలో 35 వేల మంది వరకు ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఏఐసీటీఈ గణాంకాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
➥ రాష్ట్రంలో ప్రాంగణ నియామకాలకు సంబంధించి 15-20 కళాశాలల నుంచే దాదాపు 10 వేల మంది ఎంపికవుతూ వస్తున్నారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో విద్యార్థులకు చివరి సంవత్సరం తొలి సెమిస్టర్ ప్రారంభం కాగానే ఏటా ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తుంటారు. ఏటా జులై నెలాఖరులో లేదా ఆగస్టులో ప్రాంగణ నియామకాలు మొదలవుతాయి.
➥ ఏటా ప్రముఖ కళాశాలల్లో 80-90 శాతం నియామకాలు డిసెంబరు నాటికి పూర్తవుతుంటాయి. కేవలం 10-20 శాతం విద్యార్థులే మిగులుతుంటారు. రెండో విడతలో జనవరి నుంచి మే వరకు కొన్ని కంపెనీలు వస్తుంటాయి. మిగిలిన కొంతమంది వాటికి ఎంపికవుతుంటారు.
➥ ఈసారి టాప్ కళాశాలల్లో డిసెంబరు నాటికి 50-55 శాతం మంది కూడా ఎంపిక కాలేదని ఆ కళాశాలల ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు. మిగిలిన పలు కళాశాలల్లో 20-30 శాతంలోపే ప్లేస్‌మెంట్లు దక్కాయి.
ఈ సంస్థలదే సింహభాగం..
ఐటీరంగంలో ఏటా దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల నియామకాలు జరుగుతుంటాయి. ఇందులో టీసీఎస్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్, విప్రో, డెలాయిట్, యాక్సెంచర్, క్యాప్‌జెమినీ లాంటి దిగ్గజ సంస్థలే దాదాపు 1.70 లక్షల మందిని నియమించుకుంటాయి. మిగిలిన వారిని కొత్త సాఫ్ట్‌వేర్లను రూపొందించే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్, సర్వీస్ నౌ, ఐబీఎం లాంటి కంపెనీలు తీసుకుంటాయి. ఈసారి సర్వీస్ కంపెనీలు నియామకాలకు ముందుకు రాకపోవడంతో ప్లేస్‌మెంట్ల సంఖ్య భారీగా పడిపోయింది.
టాప్ కాలేజీల్లో ఇది పరిస్థితి..
➥ ఇక రాష్ట్రంలోని ప్రధాన యూనివర్సిటీలు అయిన ఓయూ ఇంజినీరింగ్ కళాశాల, జేఎన్‌టీయూహెచ్‌లోనూ ఈ సారి నియామకాలు మందకొడిగానే సాగుతున్నాయి. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో డిసెంబరు నాటికి 70-80 శాతం ప్రాంగణ నియామకాలు పూర్తయ్యేవి, కాని ఈసారి 55 శాతం మందే ఎంపికయ్యారు. మరోవైపు జేఎన్‌టీయూహెచ్‌లో ఈసారి 536 మంది విద్యార్థులకుగాను డిసెంబరు నాటికి 216 మంది, ఇప్పటివరకు 285 మంది వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
➥ వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో ఏటా డిసెంబరు నాటికే 95 శాతం ప్రాంగణ నియామకాలు పూర్తవుతాయి, కాని ఈసారి 60 శాతం వరకే అయ్యాయి.
➥ వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో యాక్సెంచర్ సంస్థ 300 మందిని ఎంపిక చేసుకుంది. కళాశాలలో టీసీఎస్ సంస్థ నియామకాల కోసం ఇటీవల ఆన్‌లైన్ పరీక్ష(TCSNQT) నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. వచ్చే మే నాటికి కాగ్నిజెంట్, టీసీఎస్ కంపెనీల వల్ల 80 శాతం మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
➥ గత విద్యాసంవత్సరంలో డిసెంబరు (2022) నాటికి 70 శాతం నియామకాలు పూర్తయ్యాయని, ఈసారి 20 శాతం మాత్రమే అయ్యాయని స్టాన్లీ కళాశాల ప్లేస్‌మెంట్ అధికారి ఆర్.ప్రవీణ్ తెలిపారు. ఇంకా కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, హెచ్‌సీఎల్ లాంటివి రావాల్సి ఉందని, ఈసారి ఎంపికల సంఖ్య తగ్గవచ్చని అభిప్రాయపడ్డారు.