Raanjhana, director Anand L Rai Shocking Comments On Dhanush : ఈ సంక్రాంతికి 'కెప్టెన్ మిల్లర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ పాన్ ఇండియా ట్రెండ్ ఇండియాలోకి రాకముందే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. 2013లో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన 'రాంజనా' సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చాడు ధనుష్. అయితే అప్పటికి తమిళంలో స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ హిందీ ప్రేక్షకులకు ధనుష్ గురించి పెద్దగా పరిచయం లేదు. దాంతో బాలీవుడ్ లో ధనుష్ ఆ టైంలో ఆడియన్స్ కి చేరువకాలేకపోయాడు.


ఇదిలా ఉంటే తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ ధనుష్ ని తన సినిమాలో నటించాలనే నిర్ణయాన్ని బాలీవుడ్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదని, వారి నుంచి కొంత వ్యతిరేకత ఎదురైందని పేర్కొన్నారు. అందుకు కారణం నార్త్ ఇండియా హీరోలకున్న క్వాలిటీస్ ఏవీ ధనుష్ కి లేకపోవడమే. ఈ మేరకు డైరెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. "నార్త్ లో హీరోకు సంబంధించి ఆడియన్స్ లో ఒక ఇమేజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు అది నెమ్మదిగా చేంజ్ అవుతూ వస్తోంది. ఆ సమయంలో అంటే 2012 - 23 మధ్యలో నార్త్ లో 6 అడుగుల పొడవున్న ఫెయిర్ బాయ్ హీరోలుగా కనిపించేవారు. అలాంటి ప్రపంచంలో సౌత్ లో స్టార్ గా వెలుగొందిన ధనుష్ ని ఇక్కడ జనాలు విచిత్రంగా చూశారు. కానీ మీరు అతని సినిమాలు చూసినప్పుడు, అతను నటించినప్పుడు అతన్ని మించిన వ్యక్తి ఎవరూ లేరు" అని చెప్పుకొచ్చాడు.


'రాంజనా' తర్వాత మరోసారి ధనుష్ తో 'అతరంగిరే' సినిమా చేశాడు ఆనంద్ ఎల్ రాయ్. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో 'తేరే ఇష్క్ మే' అనే సినిమా రాబోతోంది. రాంజాన మూవీకి ఇది సీక్వెల్ గా రూపొందుతోంది. ఇక ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' విషయానికొస్తే.. ఈ సినిమా 1930 నాటి కథాంశంతో రూపొందింది. వెనుకబడిన వర్గానికి చెందిన ఓ యువకుడు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరి ‘కెప్టెన్ మిల్లర్’ అనే డెకాయిట్ గా ఎలా మారాడు? అనేది ఈ సినిమాలో చూపించారు.ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీని అరుణ్ మాతేశ్వర్ డైరెక్ట్ చేశారు. ధనుష్ సత్తన ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటించగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు.


భారీ అంచనాల నడుమ జనవరి 12న తమిళంలో ఈ సినిమా విడుదల అయ్యింది. తెలుగులోనూ విడుదల కావాల్సి ఉన్నా, నాలుగు పెద్ద సినిమాలు పోటీ పడటంతో వెనక్కి తగ్గి సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక తెలుగులో రిపబ్లిక్ డే కానుకగా ఈ నెల 25న సినిమాను విడుదల చేయబోతున్నారు. ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. మరి తెలుగు ఆడియన్స్ ని ఈ సినిమా ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.


Also Read : గౌతమ్ తిన్ననూరి - విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ క్యాన్సిల్? క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీమ్!