Benefits of Polytechnic Courses: పదో తరగతి తర్వాతే ఇంజినీరింగ్ చదువు అభ్యసించటానికి ఉన్న మార్గం పాలిటెక్నిక్. టెక్నికల్ విద్యలో నైపుణ్యం సంపాదించి, ఇంజినీరింగ్ లో చేరటానికి విద్యార్థులకు ఉన్న మంచి ఆప్షన్ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటల్లిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలు ఎంతగానో పురోభివృద్ధి పొందుతున్న ఈ సమయంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కు ప్రాముఖ్యత పెరుగుతోంది.


పాలిటెక్నిక్ లో చేరాలంటే పాలిసెట్ అనే ఎంట్రన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జాం లో పదో తరగతి సిలబస్ నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు ఉంటాయి. ర్యాంకును బట్టి ఆయా కాలేజీల్లో ప్లేస్మెంట్ దొరుకుంతుంది.


ఈ మధ్య కాలంలో కార్పొరేట్ సంస్థలు ఇంటిగ్రేటెడ్ పాలిటెక్నిక్ బీటెక్ కోర్సులను కూడా అందిస్తున్నాయి. పాలిటెక్నిక్ డిప్లమా వ్యవధి మూడేళ్లు. ఇందులో కూడా నచ్చిన బ్రాంచును ఎంచుకోవచ్చు. సివిల్స్, మెకానికల్, కంప్యుటర్స్ అండ్ ఇంఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, హోం సైన్స్, కెమికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, ప్రింటింగ్ టెక్నాలజీ, ఫుట్ వేర్ టెక్నాలజీ వంటి బ్రాంచులు వందల్లో ఉన్నాయి. ఇష్టమైన రంగాన్ని బట్టి ఆయా బ్రాంచులను ఎంచుకోవచ్చు.టెక్నికల్ కోర్సులే కాకుండా అగ్రికల్చర్, వెటర్నరీ, ఉద్యానవనం డిప్లొమా కోర్సులు కూడా ఉన్నాయి. ఇవి రెండేళ్ళ వ్యవధిలోనే పూర్తవుతాయి.


డిప్లొమా పూర్తయ్యాక, ఈ-సెట్ ఎంట్రన్స్ రాసి, డైరెక్టుగా బీటెక్ రెండో సంవత్సరంలో చేరిపోవచ్చు. ఎందుకంటే ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం సిలబస్ మొత్తం డిప్లొమాలోనే నేర్చేసుకుంటారు. బీటెక్ చేయటం ఇంట్రెస్ట్ లేకపోతే డిప్లొమా తర్వాత బీటెక్ కు సమానమైన కోర్సు ఇంకొకటి కూడా ఉంది. దానికంటే ముందు డిప్లొమా అర్హతతో ఏదైనా సంబధిత ఉద్యోగంలో చేరితే, ఇంజినీర్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి అసోసియేషన్ మెంబర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ కోర్సు పూర్తి చేసుకోవచ్చు.


పాలిసెట్ లో ఉన్నత ర్యాంకు పొందినట్లైతే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటల్లిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, 3డి యానిమేషన్, మల్టీ మీడియా, సైబర్ సెక్యూరిటీ వంటి అధునాతన కోర్సులను డిప్లొమాలో అంతర్భాగం చేస్తున్నాయి. డిప్లొమాలో ఈ కోర్సులు చేసినవారు. బీటెక్ లో కూడా ఇవే కంటిన్యూ చేసి మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు సంపాదించవచ్చు.


పాలిటెక్నిక్ పూర్తయ్యాక కార్పొరేట్ సంస్థల్లోనే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉద్యోగాలు మెండుగా ఉంటాయి. నీటి పారుదల, విద్యుత్తు, భవనాలు, రహదారి శాఖల్లో డిప్లొమా అర్హతతో ఉద్యోగాలు లభిస్తాయి. వీరు రైల్వే జేఈ పోస్టులకు కూడా అర్హులు. పంచాయితీరాజ్ శాఖలో కూడా వివిధ పోస్టులుంటాయి. కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, పవర్ ప్లాంట్ ఇంకా అనేక కార్పొరేట్ సంస్థల్లోని ఉద్యోగాలకూ వీరు పోటీ పడవచ్చు. ఇంతే కాకుండా ప్రముఖ పాలిటెక్నిక్ విద్యాసంస్థలు డిప్లొమా పూర్తి చేసుకున్న వారి కోసం క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహిస్తాయి. అక్కడ చూపిన ప్రతిభను బట్టి ఉద్యోగాలు కల్పిస్తాయి. 


సంబంధిత విభాగంలో డిప్లొమా చేసిన వారికి విదేశాల్లో కూడా అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు..ఎయిర్ ఫోర్స్ లో ఎక్స్, వై ట్రేడులు, కోస్టు గార్డులో యాంత్రిక్ పోస్టులకు అరబ్ కంట్రీస్ లో, సింగపూర్ లో, మలేషియా, దుబాయి వంటి చోట్ల మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.