SSC Exams In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో సోమవారం (మార్చి 18) నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు, తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు  పరీక్షలు జరుగనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్‌, మార్చి 20న ఇంగ్లిష్, మార్చి 22న మ్యాథమెటిక్స్, మార్చి 23న ఫిజికల్ సైన్స్, మార్చి 26న బయాలజీ, మార్చి 27న సోషల్ స్టడీస్.. మార్చి 28,30 తేదీల్లో వొకేషనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ ఏడాది ఏపీలో పదోతరగతి పరీక్షలకు 7,25,620 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్ధులు 6,23,092.. గతేడాది ఫెయిలై రీ ఎన్‌రోల్ అయిన విద్యార్ధులు 1,02,528. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8.45 గంటల నుంచి పరీక్షా కేంద్రాల లోపలికి విద్యార్ధులకు అనుమతిస్తారు. లీకేజీ ఆరోపణలు రాకుండా విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇన్విజలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు సైతం పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధించారు. సమస్యాత్మకమైన 130 పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టెక్నాలజీ సాయంతో లీకేజ్‌కి చెక్ పెట్టేవిధంగా.. ప్రతీ ప్రశ్నా పత్రానికి ప్రత్యేకంగా యూనిక్ కోడ్ నంబర్ కేటాయించారు. యూనిక్ కోడ్ ద్వారా ఏ సెంటర్ నుంచి ఎవరు పేపర్ లీక్ చేశారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. 

తెలంగాణలో మార్చి 18 నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 2,57,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉ న్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 18 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానుండగా..  మార్చి 30తో ప్రధాన పరీక్షలు, ఏప్రిల్ 2తో ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఇప్పటికే అధికారులు పరీక్షలు రాసే విద్యార్థులకు హాల్‌టికెట్లు, ప్రింటెడ్‌ నామినల్‌ రోల్స్‌ను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.

ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూలు..

పరీక్ష తేదీ పేపరు
మార్చి 18 ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1
మార్చి 19 సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20 థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్)
మార్చి 22 మ్యాథమెటిక్స్
మార్చి 23 ఫిజికల్ సైన్స్ 
మార్చి 26 బయాలజికల్ సైన్స్
మార్చి 27 సోషల్ స్టడీస్
మార్చి 28 మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1 
మార్చి 30 ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష 

తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూలు..

పరీక్ష తేదీ పేపరు
మార్చి 18 ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19 సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21 థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్)
మార్చి 23 మ్యాథమెటిక్స్
మార్చి 26 ఫిజికల్ సైన్స్ 
మార్చి 28 బయాలజికల్ సైన్స్
మార్చి 30 సోషల్ స్టడీస్
ఏప్రిల్ 1 ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు
ఏప్రిల్ 2 ఓరియంటెల్ పేపర్-2

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...