దేశంలో ఏటా రెండుసార్లు నిర్వహించాలనుకుంటున్న సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలకు రెండింటికీ హాజరవడం తప్పనిసరేమీ కాదని కేంద్రం స్పష్టం చేసింది. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ మేరకు అక్టోబరు 8న పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
సంవత్సరానికి పరీక్ష రాసే అవకాశం ఒక్కసారే ఉంటుందనే కారణంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరించారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ తరహాలో విద్యార్థులు సంవత్సరానికి రెండుసార్లు 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు రాసుకోవచ్చు. వీటిల్లో వచ్చిన ఉత్తమ మార్కులను విద్యార్థులు ఎంచుకోవచ్చు. ఇది పూర్తిగా ఐచ్ఛికం. ఇందులో బలవంతం ఏమీ లేదు. ఈ విధానం 2024 నుంచి అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి అన్నారు.
దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు క్యాంపస్‌ల ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించేందుకు చర్చలు జరుగుతున్నాయని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. త్వరలోనే వాటిని యూజీసీ నోటిఫై చేస్తుందని ఆయన చెప్పారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో కూడా దీనిని సమీక్షిస్తున్నామని, ఆసక్తి ఉన్న అనేక దేశాలతో చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా పరిశీలిస్తున్నారు. మేము నిపుణుల సలహాల మేరకు అన్ని రకాలుగా చర్చలు జరిపిన తర్వాతే ముందుకు వెళ్తాం అని మంత్రి చెప్పారు.
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)పై కర్ణాటక, బంగాల్ వంటి రాష్ట్రాల వాదనల్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి తోసిపుచ్చారు. వారి అభ్యంతరాలు విద్యాపరమైనవి కావు, రాజకీయమైనవి అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ విషయంలో వారు అసలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో తనకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
పరీక్షల పట్ల విద్యార్థులు పడుతున్న ఆందోళనను ప్రధాని నరేంద్ర మోదీ కూడా గమనించారు.. ఈ సందర్భంగా ప్రతిఏడు పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఆయన విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పరీక్షలకు భయపడవద్దని, ఓటములను సైతం అంగీకరించాలని ఆయన విద్యార్థులకు ధైర్యం చెప్పారు. అలాగే పరీక్షా కి పరీక్షా లో అని సైతం ప్రధాని పిలుపునిచ్చారు. అని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.
డమ్మీ పాఠశాలల పని పడతాం..
రాజస్థాన్లోని కోటాలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఇది చాలా సున్నితమైన అంశం. ఎవరూ బలవన్మరణాలకు పాల్పడకూడదు. వారూ మన పిల్లలే, విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం మన సమష్టి బాధ్యత. ఇంజనీరింగ్ కోసం జేఈఈ, మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఏటా రెండు లక్షల మంది వరకు విద్యార్థులు కోటాకు తరలి వెళుతుంటారు. ఈ క్రమంలో చాలావరకు అభ్యర్థులు రెగ్యులర్గా కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా నేరుగా బోర్డు పరీక్షలకే హాజరవుతున్నారు. ఇలా తరగతులకు గైర్హాజరు కావడం విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుందని చెప్పే కొందరు నిపుణులు ఈ డమ్మీ స్కూల్స్ సమస్యను మా దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో విద్యార్థులు ఒంటరిగా ఉంటూ ఒత్తిళ్లకు లోనవుతుంటారు అని వారు వివరించారు. ఈ నేపథ్యంలో డమ్మీ స్కూల్స్ అంశంపై సమగ్రంగా చర్చించాల్సని సమయం ఆసన్నమైంది. ఈ సమస్యను విస్మరించలేము. అధికారిక లెక్కల ప్రకారం, ఈ సంవత్సరం కోటాలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో ఉన్న కోచింగ్ హబ్‌లో ఇది అత్యధికం. గతేడాది ఈ సంఖ్య 15గా ఉంది అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.